Cyclone Biparjoy: బిపోర్‌జాయ్ ముప్పు.. రుతుపవనాల రాక మరింత ఆలస్యం..!
దిల్లీ: ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపోర్‌జాయ్' తుపాను (Cyclone Biparjoy) మరింత తీవ్ర తుపానుగా మారింది..
దీంతో ఈ ప్రభావం నైరుతి రుతుపవనాల (Southwest Monsoon)పై పడింది. తుపాను కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు..
''నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను (Cyclone Biparjoy) కారణంగా.. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2 - 3 రోజులు పట్టే అవకాశముంది'' అని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.
గతేడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. తొలుత జూన్ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా.. 7వ తేదీ వచ్చినా రుతుపవనాల ఆచూకీ కన్పించట్లేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు..
Jun 07 2023, 14:30