డౌటే లేదు.. అవును వాళ్ళిద్దరూ మారి పోయారు ❓️
అవును.. సారు నిజంగానే మారిపోయారు.. ప్రసంగం పూర్తిగా మార్చేశారు.. మొన్న నిర్మల్ లో, నిన్న నాగర్‌కర్నూల్‌లో అదే సీన్ రిపీటయ్యింది.. బీజేపీని పూర్తిగా పక్కనెట్టేశారు.. రెండ్రోజుల వ్యవధిలోనే రెండు బహిరంగ సభలు జరగ్గా ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీ ప్రస్తావన అస్సలు తీసుకురాలేదు.. కనీసం ఒక్క విమర్శ అయినా చేయడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సాహసించలేదు.
అయితే రెండు సభల్లోనూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడంతో ఏదో తేడా కొడుతోందన్న విషయం తెలంగాణ ప్రజానికానికి స్పష్టంగా అర్థమైపోయింది. నిర్మల్ ప్రసంగంతో కాస్త డౌట్ అనిపించినా.. ఇవాళ్టి సభతో పక్కా అని తేలిపోయింది. అటు నాగర్‌కర్నూల్ కార్యక్రమం ముగిసిందో లేదో అటు బీఆర్ఎస్‌లో.. ఇటు కాంగ్రెస్‌లో ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.. ఇక సోషల్ మీడియాలో అంటారా చెప్పక్కర్లేదు..!
కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా మాటకు ముందు.. వెనుక బీజేపీని దుమ్మెత్తి పోస్తుండేవారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఎందుకో.. ఒకప్పటి బద్ధ శత్రువైన బీజేపీ.. ఇప్పుడెందుకో మిత్రపక్షంగా మారిపోయిందేమోననే అనుమానాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్నాళ్లు ఆరోపణలు, విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించట్లేదు.. కనిపించట్లేదు. దీంతో బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకప్పుడు అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అన్న బీజేపీ.. ఇప్పుడు చలీ చప్పుడు చేయట్లేదు. అటు దర్యాప్తు సంస్థలు కూడా మిన్నకుండిపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్య అస్సలు బీజేపీని కేసీఆర్.. కేసీఆర్‌ను బీజేపీ నేతలు విమర్శించిన పరిస్థితుల్లేవ్.
తెలంగాణ రాజకీయాల్లో ఏదో తేడా కొడుతోందే అని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే నడుస్తోంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నిర్మల్, నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభలు జరిగాయి. ఈ రెండు సభల్లోనూ కేసీఆర్ ఎక్కడా పొల్లెత్తు మాట కూడా బీజేపీని అనలేదు. ఈ రెండు సభల్లోనూ కాంగ్రెస్‌నే టార్గెట్ చేశారు కానీ కాషాయ పార్టీ ప్రస్తావన కానీ.. కమలనాథులను విమర్శించిన పరిస్థితి అస్సలేదు. దీన్ని బట్టి చూస్తే.. ఇన్నిరోజులుగా కేసీఆర్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయన్న మాట. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ఏకైక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్సేనని పదే పదే ఇలా కేసీఆర్ చెప్పకనే చెబుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
నిర్మల్ సభలో కేంద్రంపై విమర్శల్లేవంటే ఓకే.. నాగర్‌కర్నూల్‌లో అయినా మునుపటి కేసీఆర్‌ను చూస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించాయి.. తెలంగాణ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ చూశారు. కానీ ఎక్కడ కేంద్రంపై ఇసుమంత విమర్శ కూడా చేయకపోవడంతో.. గత కొన్నిరోజులుగా వస్తున్న ఆరోపణలు, విమర్శలను కేసీఆర్ కన్ఫామ్ చేసేశారని టాక్ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తోంది. బహుశా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న విషయాన్ని కేసీఆర్ నిజం చేసేశారేమోనని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం కేసీఆర్ వింత వైఖరితో ఆలోచనలో పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండ్రోజులు కేసీఆర్ తీరుపై చర్చ జరుగుతుండగా.. నాగర్ కర్నూల్ సభతో ఇది రెట్టింపయ్యింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంత అనే దానిపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలే ఎన్నికల కాలం సమీపిస్తోంది.. ఈ పరిస్థితుల్లో జనాల్లోకి ఇలాంటి మెసేజ్ వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్ ఏముందో.. ఏంటో మరి..!
Jun 07 2023, 14:27