విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 278 మందికి చేరింది. అయితే వీరిలో కనీసం 40 మంది విద్యుతాఘాతంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించిన రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. వీరి మృతదేహాలపై ఎలాంటి గాయాలు కానీ, రక్తస్రావం ఆనవాళ్లు కానీ కనిపించలేదన్నారు. ప్రభుత్వం, రైల్వే పోలీసులు (GRP) ఇదే విషయాన్ని తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. రైళ్లు ఢీకొన్న సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో విద్యుత్ షాక్ తగిలినట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు.
తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్సు రైలును ఢీకొట్టడంతో ఎక్స్‌ప్రెస్ బోగీలు పట్టాలు తప్పి, కొన్ని పక్క ట్రాక్‌పైకి వెళ్లి పడ్డాయి. ఆ సమయంలోనే అదే మార్గంలో బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రావడం, పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఓవర్‌హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతం చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..
కాగా, ఒడిశా రైలు దుర్ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన సీబీఐ (CBI) మంగళవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలే కారణమా అనే కోణం నుంచి సీబీఐ కూలంకషంగా దర్యాప్తు జరుపనుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి, ఒడిశా ప్రభుత్వం అనుమతి, డీఓపీటీ నుంచి వచ్చిన తదుపరి ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతను సీబీఐ చేపట్టినట్టు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం, మూడు రైళ్లు ఢీకొన్న ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరుకోగా, 1,200 మంది వరకూ గాయపడ్డారు. 100కు పైగా మృతదేహాలను ఇంకా గుర్తుపట్టాల్సి ఉంది. వీటిని వివిధ ఆసుపత్రులు, మార్చురీలలో ఉంచారు.....
Jun 07 2023, 10:24