హైదరాబాద్ లో భోపాల్ పోలీసుల తనిఖీలు..
దొరికితే దోసుకుందాం అనే చందంగా తయారయ్యింది దేశం,ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలు దేశంలో రోజురోజుకీ ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భోపాల్ నుండి పోలీసులు సోమవారం హైదరాబాద్ కు వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బెట్టింగ్ యాప్ తో సూడో పోలీసుల అవతారం ఎత్తి ఓ ముఠా లక్షలు కాజేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సదరు గ్యాంగ్ సభ్యులను కొందరిని అరెస్టు చేసిన భోపాల్ పోలీసులు, మిగతా వారి కోసం హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు. అల్కాపురి కాలనీ లో నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ లో డబ్బు చెల్లిస్తామని, భారీగానే డిపాజిట్ చేస్తామని చెప్పి హవాలా ఏజెంట్లను నమ్మించి సదరు సూడోపోలీసుల గ్యాంగ్ బెట్టింగ్ యాప్ హెల్ప్ డెస్క్ ద్వారా లోకల్ ఏజెంట్ల ఫోన్ నెంబర్లను తీసుకుంటుంది. ఆ తర్వాత అసలు పని మొదలు పెడుతుంది. ఇక బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడతామని చెప్పినా ఆ గ్యాంగ్ హవాలా ఏజెంట్లు తమ వద్దకు రాగానే పోలీసులమని చెప్పి వారిని ట్రాప్ చేస్తుంది.
ఆపై నిందితుల బెట్టింగ్ యాప్ లో ఉన్న డబ్బులను తమ ఖాతాలకు బదిలీ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతుంది. ఈ తరహా మోసాలు పలు రాష్ట్రాలలో ఈ గ్యాంగ్ అమలుచేసింది. హవాలా ఏజెంట్లు ఈ మోసాన్ని బయటకు చెప్పలేకపోతున్నారు. గతవారం ఇదే తరహాలో ఈ గ్యాంగ్ భోపాల్ లో 20 లక్షల రూపాయలు కాజేసింది.
భోపాల్ లో కృష్ణ, మహేష్ అనే ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు మిగతా వారి కోసం ఆచూకీ తీయగా హైదరాబాద్ నగరంలోని అల్కాపురి కాలనీలో ఉంటున్నట్టు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన భోపాల్ పోలీసులు , హైదరాబాద్లో ఉన్న నిందితులైన సతీష్, ప్రదీప్, అనిల్, శేఖర్ ల కోసం నగరాన్ని జల్లెడ పడుతున్నారు...
Jun 06 2023, 17:20