నైరుతి దాగుడుమూతలు.. అండమాన్ సమీపంలోనే ఆగిన రుతుపవనాలు
వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. గతేడాది ఈ సమయానికల్లా భారత్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యం చేస్తున్నాయి..
ప్రస్తుతం అవి సముద్రంపైనే నిలకడగా ఉంటూ..దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ కారణంగా మరో మూడు రోజుల తర్వాతే అవి కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 15 దాకా వర్షాలు పడకపోవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం అండమాన్ దీవులను దాటి బంగాళాఖాతంలో కొంత ముందుకు వచ్చిన రుతుపవనాలు అక్కడే ఆగాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇటు అరేబియా సముద్రంలో లక్షదీవులను తాకినవీ ముందుకు కదలలేదని చెప్పారు. గతేడాది జూన్ ఒకటిన కేరళను తాకగా ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాటి ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా..
Jun 06 2023, 07:46