నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 12:49

TDP-YSRCP: కొండపిలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో తెదేపా ఎమ్మెల్యే

టంగుటూరు: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు..

గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు టంగుటూరులోని వైకాపా కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో అక్కడ సుమారు 350 మంది పోలీసులు మోహరించారు..

మరోవైపు వైకాపా తీరును నిరసిస్తూ తెదేపా నేతలు ప్రతిస్పందిస్తూ టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు బయల్దేరగా.. మార్గంమధ్యలో 16వ నంబర్‌ హైవేపై పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ తెదేపా నేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 10:19

నిర్మాణంలో ఉన్న సుల్తాన్‌గంజ్ - అగువానిఘాట్ వంతెన గంగా నదిలో మునిగిపోయింది

•సిఎం నితీష్ కుమార్ విచారణకు ఆదేశించారు

ఖగారియా జిల్లా నుంచి ఓ పెద్ద వార్త బయటకు వచ్చింది. ఖగారియాలోని అగువానీ మరియు సుల్తంగంజ్ మధ్య గంగా నదిపై నిర్మించిన ఫోర్‌లేన్ మహాసేతు యొక్క మూడు స్తంభాలు మరియు 9 మరియు 13 మధ్య నాలుగు సూపర్ నిర్మాణాలు గత ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు గంగానదిలో నిమజ్జనం చేయబడ్డాయి.

ఈ సంఘటన తర్వాత నిర్మాణ ఏజెన్సీకి చెందిన ఒక కార్మికుడు కనిపించడం లేదని ఖగారియా గోగ్రీ ఎస్‌డిఓ అమర్ కుమార్ సుమన్ తెలిపారు. మూడు స్తంభాల మధ్య ఉన్న 192 మీటర్ల స్లాబ్‌లో కొంత భాగం గంగానది ప్రధాన ప్రవాహంలో కలిసిపోయింది.

ఖగారియా-అగువానీ-సుల్తాన్‌గంజ్ మధ్య నిర్మాణంలో ఉన్న మహాసేతు సూపర్ స్ట్రక్చర్ పైభాగం కూలిపోవడంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశించారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే రోడ్డు నిర్మాణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రత్యయ్‌ అమృత్‌ నుంచి ముఖ్యమంత్రి ఈ విషయంపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమాచారం తీసుకున్న ముఖ్యమంత్రి, అదనపు ప్రధాన కార్యదర్శికి పై ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తాన్‌గంజ్ వంతెన నిర్మాణం కూలిపోవడంపై మా ఆందోళనలు సరైనవని నిరూపించబడ్డాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రభుత్వ నివాసం వద్ద, ఏప్రిల్ 30, 2022 న, తుఫాను కారణంగా, ఈ వంతెన యొక్క ఐదవ భాగం పడిపోయిందని చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:32

నేడే ‘భారత్‌ భవన్‌’కు శంకుస్థాపన!

•11 ఎకరాలు.. 15 అంతస్తుల్లో నిర్మాణం

హైదరాబాద్‌, జూన్‌05

భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ‘భారత్‌ భవన్‌’ పేరిట కోకాపేటలో నిర్మించనున్న ఈ భవనానికి సోమవారం కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. భారత్‌ భవన్‌ను 15 అంతస్తులతో నిర్మించనున్నారు. త్వరగా ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

భారత్‌ భవన్‌ నిర్మాణంతో పాటు ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’, ‘హ్యుమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ పేరిట మరికొన్ని నిర్మాణాలను బీఆర్‌ఎస్‌ చేపట్టనుంది. భారత్‌ భవన్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత కేసీఆర్‌ అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు.ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి జాతీయ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్‌ పనులు చూసుకుంటారు. మిగతా సమయాల్లో భారత్‌ భవన్‌ నుంచే పార్టీ పనులన్నీ చక్కబెట్టనున్నట్లు సమాచారం. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని సర్కారు బీఆర్‌ఎస్ కు కేటాయించింది. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ డెవల్‌పమెంట్‌’ కేంద్రం ఏర్పాటు చేసేందుకంటూ ఈ భూమిని కేటాయించింది.

ఈ కేంద్రం ఏర్పాటుకు భూమి కావాలంటూ బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గత నెల 12న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కేవలం ఐదు రోజుల్లోనే భూమిని కట్టబెడుతూప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎ్‌సకు ఇప్పటికే బంజారాహిల్స్‌లో భారీ విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయం, 33జిల్లాల్లోనూ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఉన్నా.. మళ్లీ 11 ఎకరాల భూమిని కేటాయించుకోవడం గమనార్హం. కోకాపేటలో చదరపు గజం రూ.లక్ష నుంచి లక్షన్నర పలుకుతుండగా..ప్రభుత్వం కేవలం చదరపు గజం రూ.7500 చొప్పున 11 ఎకరాలను బీఆర్‌ఎ్‌సకు కట్టబెట్టింది. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది రూ.500 కోట్ల స్థలం. కానీ, కేవలం రూ.40 కోట్లకే ప్రభుత్వం తమ పార్టీకి కేటాయించుకోవడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

నైపుణ్య శిక్షణ, అవగాహన కోసం..!

ఇంత విలువైన స్థలంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయనున్న కేంద్రం ద్వారా ప్రజా నాయకులకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం కల్పిస్తామని, సామాజికవేత్తలకు శిక్షణ ఇస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చేసుకున్న దరఖాస్తులో పేర్కొన్నారు. స్టేట్‌ ఆర్ట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌, లైబ్రరీతోపాటు ఇక్కడ శిక్షణ పొందేవారికి, పనిచేసే సిబ్బందికి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇందుకోసం గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పార్టీకి బోయిన్‌పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించుకున్న విషయాన్ని ఉదాహరణగా సర్కారు చూపిస్తోంది............

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:29

బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేసిన సిబ్బంది

బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి సిబ్బంది తప్పిదం కావడం గమనార్హం. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు.

ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు లేని సమయంలో హాస్టల్స్ రూముల తాళాలు పగల గొట్టిన సిబ్బంది.. విద్యార్థుల బట్టలు, సామాన్లు బయట పడేశారు.

ఈ నెల 7వ తేదీ నుండి విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఉండటంతో వారు తిరిగొచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలు.. పడేసిన సామాన్లు కోసం వెతుక్కోవాలా? లేదా పరీక్షలు రాయాలా? అని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలకు ఏవైనా ఆటంకాలు కలిగితే.. అందుకు బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు, సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు...

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:28

చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం.. దంపతులు మృతి.. కుమార్తెకు తీవ్రగాయాలు

విశాఖపట్నం:

భీమిలి బీచ్‌ రోడ్డులోని జోడుగుళ్లపాలెం సమీపంలో గల బేపార్క్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. వారి మూడేళ్ల కుమార్తె తీవ్రగాయాలతో కేజీహెచ్‌లో చికిత్సపొందుతోంది.

ఆరిలోవ పోలీసుల కథనం మేరకు.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరుకు చెందిన మైలపల్లి పెద్దయ్య (28) ఉపాధి కోసం చాలాకాలం కిందట విశాఖ నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. వన్‌టౌన్‌లోని పెయిందొరపేటలో నివాసం ఉంటున్నాడు.

చేపలకంచేరులో బంధువుల ఇంట్లో పెళ్లి ఉండడంతో శనివారం ఉదయం భార్య పావని (24), పెద్ద కుమార్తె నిషిత (3), ఏడాది వయస్సు కలిగిన రెండో కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పెళ్లి తంతు ముగియగానే నగరానికి తిరుగుపయనమయ్యారు.

చిన్నకుమార్తెను ఆటోలో వస్తున్న బంధువులకు ఇచ్చి భార్య, పెద్దకుమార్తెను తీసుకుని బైక్‌పై పెద్దయ్య నగరానికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు బీచ్‌రోడ్డులో జోడుగుళ్లపాలెం సమీపంలోని బేపార్క్‌ వద్దకు వచ్చేసరికి రోడ్డుపక్కన ఉన్న చెట్టుని ఢీకొనడంతో ముగ్గురూ డివైడర్‌పై పడిపోయారు.

పెద్దయ్య తలకు తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలపాలైన పావని, నిషితను సమీపంలోని గీతం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పావని మృతిచెందగా, నిషితను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఆరిలోవ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు....

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:26

ఖమ్మంలో మరో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

నిప్పంటించుకున్న విద్యార్థిని మానస

కొన్నాళ్ల క్రితమే తండ్రి మృతి

ఆ మనోవేదనే బలవన్మరణానికి కారణం?

ఖమ్మం జిల్లా :

సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే.. ఖమ్మంలో మరో మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

వరంగల్‌ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మం మమత మెడికల్‌ కళాశాలలో డెంటల్‌ నాలుగో ఏడాది చదువుతూ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది.

ఆదివారం రాత్రి హాస్టల్‌ భవనం పై అంతస్తులో తాను ఉంటున్న గదిలోకి వెళ్లిన మానస.. పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఆమె గదిలో నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన సీనియర్‌ విద్యార్థిని కేకలు వేయడంతో హాస్టల్‌ సిబ్బంది, విద్యార్థులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు. కానీ, మానస అప్పటికే మృతి చెందింది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి వద్దకు చేరుకుని మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా..కొంతకాలం క్రితం మానస తండ్రి మృతి చెందారని.. అప్పట్నుంచీ ఆమె మనోవేదనతో ఉందని సమాచారం...

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:24

సిగ్నల్‌ లోపం వల్లే...!

•కోరమండల్‌ ట్రాక్‌పై రెడ్‌సిగ్నల్‌

•అందుకే ట్రాక్‌ మారి లూప్‌ లైన్లోకి

సిగ్నల్‌ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. కోరమండల్‌ మొదటి మెయిన్‌ లైన్లోంచి లూప్‌ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్‌ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్‌ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే...

సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది.

ఈ స్టేషన్‌ వద్ద రెండు మెయిన్‌ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్‌ లైన్లున్నాయి.

పాసింజర్‌ హాల్ట్‌ స్టేషన్‌ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్‌ లైన్లకు తరలిస్తారు.

శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్‌ ముందుగా స్టేషన్‌ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్‌ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్‌లైన్‌కు మళ్లించారు.

కోరమండల్‌ వెళ్లాల్సిన మెయిన్‌ లైన్‌పై అప్పటికి రెడ్‌ సిగ్నల్‌ ఉంది. స్టేషన్‌ సిబ్బంది 17ఏ స్విచ్‌ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్‌ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్‌ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్‌ లూప్‌లైన్‌లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది.

గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్‌ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి.

 అదే సమయంలో ఆ లైన్‌లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలపై కోరమండల్‌ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది.

హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది.

సూపర్‌ ఫాస్ట్‌ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ.

ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు....

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:20

సారూ... మీరు మారిపోయారా❓️

అవును.. సారు మారిపోయారు.. ఎంతలా అంటే బాబోయ్ ఇంతకీ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరేనా.. లేకుంటే వేరేనా..? అనేంతలా మారిపోయారు..! ఈయన ప్రసంగం విన్న తెలంగాణ ప్రజానీకం ఒకింత కంగున్నది..!.. ఇక ప్రతిపక్షాలు అయితే నోరెళ్లబెట్టాయి.. గులాబీ బాస్‌లో సడన్‌గా ఇంత మార్పు ఏంటబ్బా..? అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు సైతం ఆలోచనలో పడ్డారు.. ఇందుకు కారణం ఆదివారం నాడు నిర్మల్ బహిరం ఏం మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. బహిరంగ సభలో మాట్లాడినా మాటకు ముందు.. వెనుక బీజేపీని దుమ్మెత్తి పోస్తుండేవారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రతో మొదలుపెట్టిన బహిరంగ సభలు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించాలని లెక్కలేసుకుని మరీ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన పలువురు కీలక నేతలకు గులాబీ కండువా కప్పారు.. ఇప్పటికే ఒకసారి ఎన్నికలో కూడా పాల్గొన్నారు. ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదంతో ముందుకెళ్తున్న కేసీఆర్.. బీజేపీని విమర్శించడానికి ఏ చిన్న చాన్స్ వచ్చినా సరే అస్సలు వదులుకోరు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో అందరూ గమనించే ఉంటారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్ లాంటి కీలక విషయాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టినెన్స్ విషయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరాటం చేస్తున్నారు. ఇందుకు కేసీఆర్ మద్దతు కూడా ఇచ్చారు. ఇటీవలే.. హైదరాబాద్ వేదికగా ఈ ఇద్దరు కలుసుకుని మీడియా మీట్ పెట్టి.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంపై తాడోపేడో తేల్చుకునేంత రేంజ్‌లో ఆగ్రహంతో ఊగిపోతూ కేసీఆర్ ప్రసంగించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు కూడా బీజేపీపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడేవారు. కానీ.. గులాబీ బాస్ ఎందుకో మారిపోయారు.. ఇన్ని బద్ధ శత్రువుగా చూసిన బీజేపీని మిత్రుడిగా చూస్తున్నారు..!

కేజ్రీవాల్- కేసీఆర్ భేటీ జరిగి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు.. ఈ వ్యవధిలోనే సార్ ఎందుకో మారిపోయారు..! ఆదివారం నాడు నిర్మల్‌లో జిల్లా క‌లెక్టరేట్‌, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో బాస్ మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు, యథావిధిగా బీజేపీపై విమర్శలు ఉంటాయని బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు.. తెలంగాణ ప్రజానీకం ఆశించింది కానీ.. కేసీఆర్ వింత వైఖరి ప్రదర్శించారు. అరగంటపైగా కేసీఆర్ ప్రసంగించినప్పటికీ ఎక్కడా బీజేపీ ఊసే ఎత్తలేదు. బీజేపీని పూర్తిగా పక్కనెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై విమర్శల దాడికి దిగారు. ఇన్నిరోజులు బీజేపీ అంటే ఒంటికాలిపై లేచిన సారు.. ఇప్పుడు పూర్తిగా పక్కనెట్టేశారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా బీజేపీ పార్టీ పేరు పలకడానికి కేసీఆర్ సాహసించలేదు. అంతేకాదండోయ్.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. 50 ఏళ్ల పాలనలో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతు బంధుకు రాం రాం... రైతు బీమాకు జై భీమ్ చెబుతారని తెలంగాణ ప్రజలను కేసీఆర్ హెచ్చరించారు. ఇదే సభావేదికగా నిర్మల్‌ జిల్లాలోని 396 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షలు.. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు.. జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

మొత్తానికి చూస్తే.. ఇన్నిరోజులుగా కేసీఆర్ వర్సెస్ బీజేపీగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయాయన్న మాట. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అని ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు గాను బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పాటు ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బీజేపీ గురించి పొల్లెత్తి మాట కూడా మాట్లాడకపోవడం ఆ అనుమానాలు, ఆరోపణలను నిజం చేసినట్లయ్యింది. ఇన్నిరోజులుగా బీజేపీని దుమ్ములేచిపోయే రేంజ్‌లో తిట్టిన కేసీఆర్ సడన్‌గా ఇలా మారిపోవడం వెనుక ఏం జరిగిందో.. ఏంటో మరి..!

నిజంనిప్పులాంటిది

Jun 05 2023, 09:18

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు సోమవారం స్వామివారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఆదివారం స్వామివారిని 87,434 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 39,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 04 2023, 17:59

Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్‌ గాంధీ

న్యూయార్క్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పరంపరను కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు..

తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లోనూ భాజపా (BJP) తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాదని.. యావత్తు దేశం విద్వేషపూరిత సిద్ధాంతాలను ఓడించేందుకు సిద్ధమైందని భాజపాపై నిప్పులు చెరిగారు.

''భాజపాను తుడిచిపెట్టేయగలమని కర్ణాటకలో నిరూపించాం. మేం వారిని కేవలం ఓడించలేదు. తుడిచిపెట్టేశాం'' అని న్యూయార్క్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌- యూఎస్‌ఏ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ (Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన న్యూయార్క్‌, వాషింగ్టన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో కార్యక్రమాలను ముగించుకొని మాన్‌హాటన్‌ చేరుకోనున్నారు..

2024 ఎన్నికల్లోనూ భాజపా (BJP)ను ఓడిస్తామని రాహుల్‌ అన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఓవైపు భాజపా విద్వేషపూరిత సిద్ధాంతం.. మరోవైపు కాంగ్రెస్‌ ప్రేమపూర్వక సిద్ధాంతం ప్రజల ముందున్నాయని వ్యాఖ్యానించారు..