పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెడీ-

ఏపీలో ముందస్తు ఎన్నికల సందడి కనిపిస్తోంది. జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక సంకేతాలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది..

తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణతో పాటే జగన్ కూడా డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు అలర్ట్ అయి మహానాడులో మినీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది..

పవన్ చేపట్టబోయే వారాహి యాత్రపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ చర్చలు ప్రారంభించారు. వారాహి యాత్ర రూట్ మ్యాప్, ఇతర అంశాలపై నేతలతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన నాదెండ్ల.. ఇవాళ మంగళగిరిలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. వారాహి యాత్ర గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందన్న సంకేతాల నేపథ్యంలో ఇవాళ జనసేన గోదావరి జిల్లాల నేతలతో నాదెండ్ల నిర్వహించిన సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది..

పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభిస్తారనే ప్రచారం సాగింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ఇప్పటికే రాయలసీమ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఉత్తరాంధ్ర నుంచి వారాహి యాత్ర ప్రారంభించేందుకు పవన్ ప్లాన్ చేశారు. కానీ ఉత్తరాంధ్రతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో స్పందన ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడి నుంచి ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించి గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మరో ప్రచారం సాగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది..

దేశానికే అన్నపూర్ణ మన తెలంగాణ : సీఎం కేసీఆర్

మన తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. 1969లోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని, మలిదశ ఉద్యమంలో పాల్గొనే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు నివాళులర్పించారు. ఒకసారి పోరాట చరిత్ర, అభివృద్ధి ప్రస్తానాన్ని తలచుకుందామని, భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభసందర్భంలో ప్రజలందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు. మనం స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందామన్నారు. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు.

ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్రాప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారన్నారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైందన్నారు. 1971 లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ కు మద్దతుగా ప్రజాతీర్పు వెలువడినప్పటికీ.. దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదన్నారు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశా నిస్పృహలు ఆవరించాయన్నారు.

ఉద్యమాన్ని రగిలించేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా.. నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడంవల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. 2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలిందన్నారు. ‘ఇంకెక్కడి తెలంగాణ’ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైందన్నారు. అహింసాయుతంగా, శాంతియుత పంథాలో వివేకం పునాదిగా, వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయన్నారు.

ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులూ, విద్యావంతులూ, ఉద్యోగ ఉపాధ్యాయులూ, కవులూ, కళాకారులూ, కార్మికులూ, కర్షకులూ, విద్యార్ధులూ, మహిళలూ కులమత భేదాలకు అతీతంగా, సిద్ధాంతరాద్ధాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారన్నారు. వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నానన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటినుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మణా అంకితమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.

అమరవీరులను స్మరిస్తూ గవర్నర్ తమిళిసై భావోద్వేగం... మొత్తం తెలుగులోనే ప్రసంగం

అమరవీరులను స్మరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు.

అక్కడ నృత్యకారులతో కలిసి గవర్నర్ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు.

ఆధునిక ప్రపంచంలో తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మంది అమరులయ్యారన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని చెప్పారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని.. అది ఆత్మ గౌరవ నినాదమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ తమిళి సై ఆకాంక్షించారు.

నా జీవితం ప్రజల కోసమే...

తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే కాదని గవర్నర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుందని చెప్పారు. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్1 కావాలని ఆకాంక్షించారు. అమరవీరులందరికీ జోహార్లు తెలిపారు. ‘‘నా జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసమే.. దేవుడు నన్ను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టం. నేను మీతో ఉన్నాను. మీరు నాతో ఉన్నారు’’ అంటూ గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.

వైఎస్సార్‌ బీమా నమోదు ప్రారంభం

ఈనెల 7లోగా నమోదు పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం 

‘కుటుంబ పెద్ద’ సహజ మరణమైతే రూ.లక్ష పరిహారం

ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత వైకల్యం చెందినా రూ.5 లక్షలు

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం అమలు..

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు వర్తింపు

అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్‌ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కుటుం­బాన్ని పోషి­ంచే వ్యక్తి సహజంగా లేదా ప్రమాద­వశాత్తు మరణిస్తే.. ఆ కుటు­ం­బాలకు ప్రభు­త్వం వైఎ­స్సార్‌ బీమా అందజేస్తోంది.

గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమ­వ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు వివరా­లను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయా­లని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.­జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్‌ బీమా పథకాన్ని 2021 జూలై 1న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్‌ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. 18–50 ఏళ్లలోపు వయసున్న కుటుంబ పెద్ద సహజంగా మర­ణిస్తే వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష పరి­హారంగా అందజేస్తారు. అలాగే 18–70 ఏళ్ల­లోపు వయసున్న కుటుంబ పెద్ద ప్రమాద­వశాత్తూ మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు.

బీమా కంపెనీలు, బ్యాం­కులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరి­హా­రం చెల్లింపును ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది..

YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వై.ఎస్‌.భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది..

విచారణను న్యాయస్థానం ఈనెల 5కు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది. భాస్కరరెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు.

''సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో నా పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవు. సాక్ష్యాల చెరిపివేతలో నాకు ఎలాంటి సంబంధంలేదు. ఎలాంటి ఆధారాలూ లేకపోయినా నన్ను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా నా ఆరోగ్యం సరిగా లేదు'' అని భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వివేకా హత్య కేసులో కుట్రతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతలో కీలక పాత్ర పోషించారంటూ భాస్కరరెడ్డిని సీబీఐ ఏప్రిల్‌ 16న అరెస్టు చేసింది..

మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌ రెడ్డి సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. కేసు విచారణను సీబీఐ కోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది..

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ వేడుకలు.. జిల్లాల్లో జాతీయ జెండా రెపరెపలు

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. ఇటు గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకల సందర్భంగా అసెంబ్లీ అవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అటు తెలంగాణ భవన్‌లో కేకే జెండాను ఆవిష్కరించారు.

సిద్దిపేట: జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీశ్ రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు.

జగిత్యాల: జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ జెండాను ఎగురవేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే కొత్తగూడెం ప్రగతి మైదాన్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ తదితరులు నివాళులర్పించారు. అటు సింగరేణి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా డైరెక్టర్ ఆపరేషన్ ఎన్ వి కే శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో పర్సనల్ విభాగం ఐ.జి. కమలాసన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం లోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సిద్దిపేట: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయం, గాంధీ విగ్రహం, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రఘునందన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి కలెక్టరేట్‌లను అధికారులు అందంగా ముస్తాబు చేశారు. ఆయా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మహబూబ్ నగర్: జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో హోంమంత్రి మహమూద్ అలీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్ రెడ్డి అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఆపై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్‌పీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

మెదక్: జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు పాల్గొన్నారు.

వనపర్తి: జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల భవనంలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నిరంజన్ రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించి, జాతీయ పాతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ రక్షిత కె మూర్తి పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల: జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు హాజరై జాతీయ జండా ఎగురవేశారు.

నల్గొండ: నల్గొండలో అమర వీరుల స్థూపానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులర్పించారు. ఆపై కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, నోముల భగత్, భాస్కర్ రావు పాల్గొన్నారు.

వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ, దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలంగాణ అమరవీరుల స్థూపనికి నివాళ్ళు అర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, బిసి కమిషన్ సభ్యులు సుభప్రద్ పటేల్, కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటి రెడ్డి తదితరులు హాజరయ్యారు.

కరీంనగర్: జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి డీజీపీ అంజనీ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ నివాళులు అర్పించారు.

నిర్మల్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలోకలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సత్సంకల్పంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలలో భాగంగా ఆలయ అర్చకుల చేత అధికారులు సుదర్శన హోమం నిర్వహించి మూలవరులకు సువర్ణ పుష్పార్చన చేశారు....

నేడు తెలంగాణ10 వ అవతరణ దినోత్సవం : 21 రోజులపాటు వేడుకలు

అమరుల త్యాగాల స్ఫూర్తితో మూడున్నర కోట్ల ప్రజలు కలబడి, నిలబడి, పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం..కేవలం తొమ్మిదేండ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో దూసుకుపోతున్నది.

ఈ నేపథ్యంలో వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికం, ఐటీ, ఆర్థిక ప్రగతి.. ఇలా ప్రతిరంగం విజయాన్నీ ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం యావత్తు సమాయత్తమైంది.

ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకలను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

విద్యుద్దీప కాంతుల్లో సచివాలయం జిగేల్‌

దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణ విద్యుద్దీపకాంతులతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తళుకులీనుతున్నది. అలాగే, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించారు. సచివాలయంలో ప్రారంభ వేడుకల ఏర్పాట్ల కోసం శాఖలవారీగా 13,398 అధికారులను నియమించడంతోపాటు అన్ని శాఖల నుంచి 7,250 మందిని వేడుకలకు ఆహ్వానించారు. వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. వేడుకల సమన్వయం కోసం ప్రభుత్వం ఇప్పటికే నోడల్‌ అధికారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్‌ పోరాడారు: కిషన్‌ రెడ్డి

నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాలు జరుపుతోంది.

ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో పోరాడారు. ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని అన్నారు.

తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగింది.

తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందరో త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాధన కోసం 1200 మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలని కిషన్ రెడ్డి అన్నారు....

సిరిసిల్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులు

సంపన్న వర్గాల ప్రజలు,విద్యార్థులు రాష్ట్ర సాధన కొరకు కంటాలు తెగిపడేలా నినదించిన గొంతులు,లాటి దెబ్బలను లెక్కచేయని శరీరాలు మంటల్లో మగ్గిపోయిన శ్రీకాంత్ చారి అన్నలాంటి బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్బవ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్,TNSF నాయకులు మోతె రాజిరెడ్డి..

SB NEWS

SB NEWS

SB NEWS

సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు : పాల్గొన్న మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా :

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్‌రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతుకుముందు సిద్ధిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు.

ఆపై ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సెంట్రల్ వేడుకల్లో భాగంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పదేళ్ల జిల్లా ప్రగతి నివేదికను మంత్రి హరీష్‌రావు వివరించారు......