నేడు తెలంగాణ10 వ అవతరణ దినోత్సవం : 21 రోజులపాటు వేడుకలు

అమరుల త్యాగాల స్ఫూర్తితో మూడున్నర కోట్ల ప్రజలు కలబడి, నిలబడి, పోరాడి సాధించుకొన్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగిడుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన రాష్ట్రం..కేవలం తొమ్మిదేండ్లలోనే లక్ష్యాలకు మించిన ప్రగతితో దూసుకుపోతున్నది.

ఈ నేపథ్యంలో వ్యవసాయం, విద్యుత్తు, తాగు, సాగునీరు, పల్లె, పట్టణాల అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశ్రామికం, ఐటీ, ఆర్థిక ప్రగతి.. ఇలా ప్రతిరంగం విజయాన్నీ ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం యావత్తు సమాయత్తమైంది.

ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకలను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

విద్యుద్దీప కాంతుల్లో సచివాలయం జిగేల్‌

దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. త్రివర్ణ విద్యుద్దీపకాంతులతో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తళుకులీనుతున్నది. అలాగే, 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహాన్ని రంగు రంగుల లైట్లతో అలంకరించారు. సచివాలయంలో ప్రారంభ వేడుకల ఏర్పాట్ల కోసం శాఖలవారీగా 13,398 అధికారులను నియమించడంతోపాటు అన్ని శాఖల నుంచి 7,250 మందిని వేడుకలకు ఆహ్వానించారు. వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. వేడుకల సమన్వయం కోసం ప్రభుత్వం ఇప్పటికే నోడల్‌ అధికారులను కూడా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్‌ పోరాడారు: కిషన్‌ రెడ్డి

నేడు తెలంగాణ అవతరణ దినోత్సవం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గోల్కోండ కోటలో అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాలు జరుపుతోంది.

ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌లో పోరాడారు. ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదు. తెలంగాణ ప్రజల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని అన్నారు.

తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ వందనాలు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చారిత్రాత్మక ఘట్టం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగింది.

తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందరో త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ సాధన కోసం 1200 మంది అమరులయ్యారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడాలని కిషన్ రెడ్డి అన్నారు....

సిరిసిల్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులు

సంపన్న వర్గాల ప్రజలు,విద్యార్థులు రాష్ట్ర సాధన కొరకు కంటాలు తెగిపడేలా నినదించిన గొంతులు,లాటి దెబ్బలను లెక్కచేయని శరీరాలు మంటల్లో మగ్గిపోయిన శ్రీకాంత్ చారి అన్నలాంటి బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్బవ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్,TNSF నాయకులు మోతె రాజిరెడ్డి..

SB NEWS

SB NEWS

SB NEWS

సిద్దిపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు : పాల్గొన్న మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా :

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో హరీష్‌రావు పోలీసు గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతుకుముందు సిద్ధిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి అమరులను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు.

ఆపై ముస్తాబాద్ సర్కిల్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సెంట్రల్ వేడుకల్లో భాగంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పదేళ్ల జిల్లా ప్రగతి నివేదికను మంత్రి హరీష్‌రావు వివరించారు......

నేడు గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్

అమరావతి:

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. నగరంలో వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2 కార్యక్రమంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి చుట్టుగుంటలో ఏర్పాటు చేసిన వైయస్సార్‌ యంత్రసేవా పథకం మెగా మేళా –2 వద్దకు చేరుకుని రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళతారు.

కాగా ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే జనం ఆనందం మాట మరిచి ఆందోళన చెందుతున్నారు. ఆయన వచ్చి వెళ్లే వరకే కాకుండా ఒక రోజు ముందు నుంచి ఆ ప్రాంతంలో రహదారుల నుంచి దుకాణాల వరకూ అన్నీ బందు చేయాల్సి వస్తుంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక దుకాణాల మూతతో నష్టపోతున్నామని వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

శుక్రవారం ఉదయం గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో జరిగే ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానున్నారు. ఈ సందర్భంగా గురువారం నుంచే ఆ ప్రాంతంలో అధికారులు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం చుట్టుగుంట సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొననున్న దృష్ట్యా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి వేదిక వరకు రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడింగ్‌ చేసి అన్ని దారులు మూసేయాలని నిర్ణయించారు. సీఎం కాన్వాయ్‌ ప్రయాణించే మార్గంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో వాటికి శుక్రవారం ఉద్యోగులు చేరుకోవడానికి ఎన్ని ప్రయాసలు పడాల్సి ఉంటుందో చెప్పలేని పరిస్థితి.

సీఎం కార్యక్రమం జరిగే వేదిక చుట్టుగుంట సెంటర్‌లో చిలకలూరిపేట రోడ్డు వైపున ఉంటుంది. నల్లపాడు రోడ్డులో ఉన్న రైతుబజార్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ శుక్రవారం రైతుబజార్‌ మూసేయాలని మూడు రోజుల క్రితమే మార్కెటింగ్‌ అధికారుల ద్వారా వ్యాపారులకు చెప్పించారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం సీఎం పర్యటన ముగిసే వరకు చుట్టుగుంట సెంటర్‌లోని అన్ని దుకాణాలు మూసి ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. దీని వల్ల ఆ రోజున పరిసర ప్రాంతాల ప్రజలు కూరగాయల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లక తప్పదు. అయితే చుట్టుగుంట మొదలుకుని అంతా బ్యారికేడింగ్‌ చేస్తోన్నందున కార్పొరేషన్‌ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్‌కు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాలి. ఇక చుట్టుగుంట సెంటర్‌లో షాపులన్నీ గురువారం సాయంత్రం నుంచే మూసేయించారు. ఆఖరికి రోడ్డు పక్కన చిరువ్యాపారులను కూడా అధికారులు వదల్లేదు. కొబ్బరి బోండాలు, తాటిముంజలు విక్రయించే వారిని కూడా ఖాళీ చేయించారు. అసలే వ్యాపారాలు లేక డీలా పడిన వ్యాపారులపై మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా రెండు రోజులు నష్టం వాటిల్లనుంది. పరేడ్‌గ్రౌండ్‌ నుంచి ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో ఉన్న చుట్టుగుంట వరకు బ్యారికేడింగ్‌ చేసి ఎవ్వరిని అనుమతించకుండా చేస్తారు. దీని వల్ల టుబాకో బోర్డు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, డీఆర్‌డీఏ, జిల్లాపరిషత్తు, అటవీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, సాంఘిక సంక్షేమం తదితర శాఖల ఉద్యోగులు సకాలంలో ఆఫీసులకు చేరుకోవాలంటే ఎన్నో తిప్పలు పడాల్సి ఉంటుంది. అలానే ఐటీసీ కార్పొరేట్‌ ఆఫీసుకు ఆ సంస్థ సిబ్బంది చేరుకోవాలన్నా ఇబ్బందే.......

శ్రీశైలంలో ఐదుగురు ఉద్యోగుల బదిలీ

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఐదుగురు శాశ్వత ఉద్యోగులను రాయలసీమ జోన్ పరిధిలోని ఆలయాలకు బదిలీ చేశారు. 5 సంవత్సరాలు నుంచి బయటకు కదలని ఉద్యోగులు సాధారణ బదిలీలలో భాగంగా ముందుకు కదిలారు.

దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఏఈవో స్థాయి ఒకరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు ఇలా ఐదుగురు ఉద్యోగులను శ్రీకాళహస్తి, కాణిపాకం, మహానంది, తదితర ఆలయాలకు బదిలీలు చేస్తూ ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన వారిలో దేవస్థానం పి.ఆర్.ఓ శ్రీనివాస్‌ను ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్‌ని శ్రీకాళహస్తికి మరో జూనియర్ అసిస్టెంట్ మహానందికి మరో జూనియర్ అసిస్టెంట్‌ని కాణిపాకం ఆలయానికి కమిషనర్ బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వారం రోజుల్లో వారికి కేటాయించిన ఆలయాల్లో రిపోర్ట్ చేయాలని కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు.

అయితే గత సంవత్సరంలో జూన్ 30న 44 మందికి శ్రీశైలం దేవస్థానం నుంచి ఇతర ఆలయాలకు బదిలీ చేశారు. కానీ పట్టుమని ఎనిమిది నెలలు తిరక్క ముందే అందరూ మళ్లీ శ్రీశైల దేవస్థానంకి ట్రాన్స్‌ఫర్‌పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఈసారైనా బదిలీలు అయిన వారు ఉంటారా మళ్ళీ సంవత్సరంలో తిరిగి సొంత ఆలయాలకు చేరుకుంటారా అని దానిపై స్థానికంగా చర్చలు మొదలయ్యాయి.

ఏపీలో ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభం : మంత్రి విడదల రజిని

గుంటూరు:

రాష్ట్రంలో ఈ ఏడాది ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించనున్నట్లు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు.

విజయనగరం, నంద్యాల ఏలూరు, మచిలీపట్నం,రాజమండ్రి మెడికల్ కాలేజీల్లో ఆగస్టులో సీట్లు భర్తీ చేస్తామని,సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.కొత్తగా ప్రారంభం అయ్యే 5 మెడికల్ కాలేజీలు నుంచి 750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 462 మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రంలో వందల క్రితం విశాఖలో తొలి మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇది ఒక చరిత్ర’’ అని మంత్రి రజిని అన్నారు.

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ లక్ష్యం. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును తీసుకువచ్చాం. సీఎం జగన్‌ వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్యశాఖలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భర్తీ చేసిన అన్ని ఖాళీలు ఏ ప్రభుత్వం భర్తీ చేయలేదు. వైద్య ఆరోగ్యశాఖలో నాలుగేళ్లలో 49 వేల పోస్టులను భర్తీ చేశాం’’ అనిమంత్రి విడదల రజిని తెలిపారు.....

శతాబ్ది ఉత్సవాలకు నాతో కలిసి వచ్చేదెవరు? హ్యాండ్ ఇచ్చేదెవరు❓️

తెలంగాణ రాజకీయం రాష్ట్ర అవతరణ దినోత్సవ ల చుట్టూ తిరుగుతుంది, ఎన్నికలకు ముందు ఇదే చివరి అవతరణ ఉత్సవాలు కావడంతో వేడుకలను ఘనంగా,నిర్వహించేందుకు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. తెలంగాణ క్రెడిట్‌ ను కొట్టేసేందుకు అధికార బీఆర్ఎస్‌తో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహా రచన చేస్తున్నాయి.

దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైతే గతానికి భిన్నంగా ఈ సారి కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సిద్ధమైంది. ఈ రెండు పార్టీలకు షాకిచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రత్యేక కార్యచరణతో ప్రజల్లోకి వెళ్తోంది. దీంతో రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎవరి పండగ వారిదే అన్నట్లుగా సీన్ మారిపోయింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సెక్రటేరియట్ వద్ద రేపటి ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తవుతుండగా కేద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గొల్కొండ కోటలో నిర్వహించబోతున్న వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.

తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంటే తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిందనే విషయాన్ని బీజేపీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. రాష్ట్ర ఏర్పాటులో బీజీపీ తోడ్పాటు ఉందని సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తాము తెలంగాణ కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతుంటే తమపై కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేయించిందని ఆరోపించారు.

ఇక బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అవతరణ వేడుకలు తొలుత ప్రియాంక గాంధీ వస్తారనే ప్రచారం జరిగినా అనూహ్యంగా ఈ వేడుకలకు మాజీ లోక్ సభ స్పీకర్ మీరాకుమారి వస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో లోక్ సభ స్పీకర్ గా మీరాకుమారినే ఉన్నారు. సభలో గందరగోళ పరిస్థితి ఉన్నా బిల్ ఆమోదం పొందడానికి మీరా కుమారి సహకరించారనే విషయాన్ని టీ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా తెలుస్తోంది. అంతే కాదు రేపటి నుంచి 20 రోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ టీపీసీసీ వివిధ కార్యక్రమాలను రూపొందించడం హాట్ టాపిక్‌గా మారింది...

.

ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు

ఆర్టీసీ ఉద్యోగుల‌కు డీఏ ఇస్తున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్, చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ గురువారం ప్ర‌క‌టించారు. జులై 2022 లో ఇవ్వాల్సి ఉన్న 4.9 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు సంస్థ చెల్లిస్తుందని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారు. 2011లో దాదాపు 29 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కానుకగా పెండింగ్ లో ఉన్న ఏడో డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు ఏడు డీఏలను సంస్థ మంజూరు చేసింది.

మిగిలిన ఒక్క డీఏను త్వరలోనే ఉద్యోగులకు ప్రకటిస్తుంది అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

రోడ్డుపై వెళ్తుండగా.. స్కూటీలో చెలరేగిన మంటలు

మహబూబాబాద్ జిల్లాలోని బొల్లెపెల్లి గ్రామంలో గురువారం నడిరోడ్డుపై స్కూటీ తగలబడింది. స్కూటీపై వెళ్తుండగా అకస్మాత్తుగా ముందుబాగంలో మంటలు చెలరేగాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన వాహనదారుడు స్కూటీని ఆపి దిగిపోయాడు. ఈ ఘటనలో స్కూటీ ముందుభాగంగా పూర్తిగా కాలిపోయింది.

గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు స్కూటీలో మంటలు చెలరేగాయి. గుండెంగాకు చెందిన బోడ రవీందర్ స్కూటీపై వెళ్తుండగా...

ముందు భాగంలో మంటలను స్థానికులు గుర్తించి రవీందర్కు చెప్పారు. దీంతో రవీందర్ బండిని ఆపి దిగిపోయాడు. ఆ తర్వాత స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేశారు..........