ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి

న్యూ ఢిల్లీ :

ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారారు. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన దాఖలు చేశారు. శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనకు కోర్టు సైతం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారారు. గత ఏడాది నవంబర్‌లో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కాగా తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును ఆయన నేడు కోరారు.

శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నారంటూ వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించనుందని.. ఈ మేరకు హోం శాఖ ఆదేశాలు జారీ చేసిందని సైతం ప్రచారం జరిగింది. ఈ పరిణామంతో, సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ మద్యం స్కాంలో మరోసారి తెరపైకి రానుందా!? అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్‌ ఆదివారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా వారి మధ్య ఢిల్లీ మద్యం స్కాం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, స్కాంలో నిందితుడైన శరత్‌ చంద్రా రెడ్డి అప్రూవర్‌గా మారనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని హోం శాఖ ఆదేశించినట్లు వివరించాయి. ఆయన అప్రూవర్‌గా మారి కుంభకోణంలో కవిత పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయని ఆ వర్గాలు చెప్పాయి. ఢిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్‌ గ్రూప్‌ తరఫున పాల్గొన్న వారిలో కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, వ్యాపారస్తుడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు గోరంట్ల, శరత్‌ చంద్రారెడ్డి ఉన్న విషయం తెలిసిందే.

కవిత ప్రేరణతోనే తాను మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని శరత్‌ చంద్రా రెడ్డి చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు శరత్‌ చంద్రా రెడ్డి కూడా అప్రూవర్‌గా మారడంతో కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. నిజానికి, స్కాంలో కవిత లావాదేవీల సమాచారం ఉన్నా కేంద్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు ఢిల్లీ పెద్దలకు అనేక సార్లు చెప్పారు. కేసీఆర్‌ కుటుంబాన్ని కేసుల వలయంలో ఇరికిస్తే తప్ప బీఆర్‌ఎస్‌ బలహీనం కాదని, బీజేపీకి అవకాశాలు దక్కవని చెబుతూ వచ్చారు. ఢిల్లీలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఏదో అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మడం మొదలు పెట్టారని, కవిత అరెస్టు అయితేనే బీజేపీపై నమ్మకం పెరుగుతుందని ఇటీవల బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది...

Pakistan : పాకిస్థానీ చొరబాటుదారుడి కాల్చివేత

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (BSF) మట్టుబెట్టింది. భద్రతా సిబ్బంది హెచ్చరించినప్పటికీ, ఆ వ్యక్తి దూసుకొస్తుండటంతో కాల్పులు జరిపారు..

అంతర్జాతీయ సరిహద్దుల్లో సాంబ సెక్టర్లో ఈ సంఘటన గురువారం జరిగింది.

బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ సరిహద్దుల్లోని బీఓపీ (బోర్డర్ ఔట్ పోస్ట్) మంగు చక్ వద్ద గురువారం తెల్లవారుజామున 2.50 గంటలకు పాకిస్థాన్ వైపు నుంచి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా దూసుకొస్తుండాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గమనించారు.

ఆ వ్యక్తిని హెచ్చరించినప్పటికీ, ఆ వ్యక్తి సరిహద్దు కంచె వైపు దూసుకొచ్చాడు. దీంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సాంబ సెక్టర్‌లో బీఎస్ఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు..

తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ నేతకు పిలుపు..

విజయవాడ: తాడేపల్లి ప్యాలెస్ వేదికగా మరోసారి బుజ్జగుంపుల పర్వం మొదలైంది. ఇప్పటికే అధిష్టానంపై గుర్రుగా ఉండి.. నియోజకవర్గానికే పరిమితమైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సీఎంవో నుంచి సమాచారం అందింది..

గురువారం మధ్యాహ్నం రావాలని బాలినేనికి పిలుపు వచ్చింది. గత కొంతకాలంగా వైసీపీలో నేతల తిరుగుబాటు అధినేత జగన్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

ముఖ్యంగా కీలకమైన ఒంగోలు జిల్లా రాజకీయాలు ముఖ్యమంత్రికి నిద్రపట్టనివ్వటంలేదు. ఓ వైపు మామ, మరోవైపు బాబాయిల రాజకీయ వ్యవహారం పార్టీకి తీరని నష్టం కలిగిస్తోందని జగన్ భావిస్తున్నారు. దీనికొక పరిష్కారం కావాలని ఆయన నిర్ణయించారు..

SB NEWS

రైతులు బాగుండాలనే పెట్టుబడి సాయం: పత్తికొండలో సీఎం జగన్‌

కర్నూలు: రైతన్నకు మంచి జరగాలనే తాపత్రయంతో ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల ఖాతాల్లోకి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధుల జమ కార్యక్రమ బహిరంగ సభలోపాల్గొని ప్రసంగించారు.

మీ ప్రేమానురాగాలకు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నా. ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ అభివాదం చేసి మరీ తన ప్రసంగం ప్రారంభించారాయన.

రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతన్నల కోసం భరోసా ఇస్తూ.. బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలోనే సాయం జమ చేస్తున్నాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఈ పెట్టుబడి సాయం అని అన్నారాయన..

ప్లాట్ ఫామ్ ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ రెండు గంటలు నరకం

ఖమ్మంజిల్లా :

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గురువారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది,రైలు ఎక్కుతుండగా ఓమహిళ జారిపడింది. ట్రైన్‌, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయింది.

మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కల్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న అనంతరం తిరిగి మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు. వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా రైలు కదిలింది.

దీంతో మహిళ కాలుజారి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కపోయి రెండు గంటలు నరకం అనుభవించింది,ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. దీనిని గమనించిన రైల్వే సిబ్బంది అతి కష్టం మీద మహిళను బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

ములుగు జిల్లా లో నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్టు

ములుగు జిల్లా:

వాజేడు మండలంలో నలుగురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.. వెంకటాపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిఐ కె శివప్రసాద్ ఈ వివ‌రాల‌ను వెల్లడించారు..

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు అగ్ర నాయకులు దళ సభ్యులు ..మరికొంతమంది వాజేడు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మిషన్లను తగలబెట్టి ..అటుగా వచ్చే పోలీసు పార్టీని ల్యాండ్ మెన్ ఏర్పాటు చేసి చంపాలని కుట్ర పన్నుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలతో వాజేడు నుండి గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న దారిలో తనిఖీ నిర్వహించారు..

ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ పై ఒక బస్తా బ్యాగు పెట్రోల్ టీం తో గుమ్మడిదొడ్డి వైపు నుండి వాజేడు వైపు వస్తు పోలీస్ పార్టీని చూసి పారిపోవాలని ప్రయత్నించారు..

గమనించిన పోలీసులు వారిని అదుపులో తీసుకొని తనిఖీ చేయగా.. అందులో పేలుడు పదార్థాలు కనిపించడంతో ఇద్దరు పంచులను పిలిపించి వారి సమక్షంలో విచారణ నిర్వహించారు.. పుల్లూరి నాగరాజు వావిలాల నర్సింగరావు ఎం పెల్లి జాగావా కంబాలపల్లి గణపతి అనే నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు సిఐ తెలిపారు...

వాహనదారులకు అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం మూడు వారాలపాటు ఘనంగా నిర్వహిస్తున్నది. తొలిరోజైన శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో సెక్రటేరియట్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. ఈ సందర్భంగా సచివాలయం, గన్‌పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.

అమరవీరుల స్తూపం వద్ద..

అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్‌ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్‌ మినార్‌, ఇక్బాల్‌ మినార్‌ నుంచి ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్‌ సైఫాబాద్‌ పీఎస్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌ వైపు, బీజేఆర్‌ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్‌ జంక్షన్‌, బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు.

ఆంక్షలు ఎక్కడంటే..

వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి సాదన్‌ కాలేజీ వైపు మళ్లిస్తారు. వీవీఐపీ రాకపోకల సందర్భంగా షాదాన్‌ కాలేజీ నుంచి సోమాజిగూడ రూట్‌లో ట్రాఫిక్‌ను కొన్ని నిమిషాల పాటు ఆపుతారు.

ఇక్బాల్‌మినార్‌ జంక్షన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వద్ద మళ్లిస్తారు. అలాగే, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి కట్టమైసమ్మ జం క్షన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు. అఫ్టల్‌గంజ్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి ఎన్టీఆర్‌మార్గ్‌ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.

బడాగణేశ్‌ లేన్‌ వైపు నుంచి ఐమాక్స్‌, నెక్లెస్‌ రోటరీ నుంచి మింట్‌ కంపౌండ్‌ వెళ్లే వాహనాలను రాజ్‌దూత్‌ లేన్‌లోకి మళ్లిస్తారు.

మింట్‌లేన్‌ నుంచి బడాగణేశ్‌ రూట్‌లో అనుమతించరు. ఈ వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు మళ్లిస్తారు........

నా కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు ఉరితీస్తా : కొండ మురళి

వరంగల్ జిల్లా :

వరంగల్‌లో కాంగ్రెస్ నేత కొండా మురళీ అనుచరులు, వ‌రంగ‌ల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అనుచరుల మధ్య నిన్న జరిగిన వివాదంపై కొండా మురళీ గురువారం నాడు ఘాటుగా స్పందించారు.

తన కార్యకర్తలను టచ్ చేస్తే నాలో పాత మురళీ బయటకు వస్తాడు అంటూ హెచ్చరించారు. తన కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు ఉరివేసి వేలాడదీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.

వరంగల్ తూర్పు టికెట్ కొండా సురేఖ దే... ఇది రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు.

వరంగల్‌కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరతామని తనతో చెబుతున్నారు. కానీ వారిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొండా మురళీ పేర్కొన్నారు....

2000 రూపాయల నోట్లు, ఉపసంహరణ నక్సలైట్ల కు ఎదురు దెబ్బ

ఛత్తిస్ గడ్ :

2000 రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం తో,నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలింది ఎందుకంటే దోపిడీ ద్వారా సేకరించిన నిధులు ప్రధానంగా ఈ డినామినేషన్‌లోనే ఉన్నాయని మహారాష్ట్రలోని సీనియర్ పోలీసు అధికారి గురువారం పేర్కొన్నారు.

నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు నక్సలైట్లు చురుగ్గా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గత గురువారం ఇద్దరు వ్యక్తులను నక్సలైట్ కమాండర్‌కు చెందిన రూ. 6 లక్షల 2,000 కరెన్సీ నోట్లతో అరెస్టు చేశారు.

2000 రూపాయల నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించింది మరియు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని లేదా సెప్టెంబర్ 30 వరకు మార్చుకోవాలని ప్రజలను కోరింది.

గడ్చిరోలి రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సందీప్ పాటిల్ పీటీఐతో మాట్లాడుతూ రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవడం నక్సలైట్లకు ఎదురుదెబ్బ తగిలిందని, పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్ల నుంచి నక్సలైట్లు దోపిడీ చేసిన సొమ్ము ప్రధానంగా ఈ డినామినేషన్‌లోనే ఉండి వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిందని అన్నారు. అడవులలో.

తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు నక్సలైట్లు చురుగ్గా మారారని గడ్చిరోలి పోలీసులకు నిఘా సమాచారం అందిందని తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఇది వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 నోట్లలో రూ.6 లక్షలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని, నక్సలైట్ల నుంచి ఈ డినామినేషన్‌లో కరెన్సీని పొందిన వ్యక్తిపై నమోదైన నేరాన్ని ఆ అధికారి ప్రస్తావించారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారని, జన మిలీషియా మరియు ప్రధాన నక్సలైట్ మద్దతుదారులపై నిఘా ఉంచారని పాటిల్ చెప్పారు.

పోలీసులు టెండు లీవ్స్ కాంట్రాక్టర్లపై కూడా నిఘా ఉంచారు మరియు బ్యాంకు అధికారులతో రూ. 2,000 నోట్ల మార్పిడి గురించి సమాచారం కోసం టచ్‌లో ఉన్నారు.....

సిద్ధిపేటలో రైల్వేట్రాక్ పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేటజిల్లా :

సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులు రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య మంత్రి హరీష్‌రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబు, ఇతర అధికార యంత్రాంగంతో కలిసి క్షేత్రస్థాయి రైల్వే ట్రాక్ పనులను మంత్రి పరిశీలించారు.

సిద్ధిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

దుద్దెడ - సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనుల గురించి మంత్రికి రైల్వే శాఖ అధికారులు వివరించారు. దుద్దెడ - సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో భాగంగా మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీసి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు.......