నిన్న కవిత పేరు లేదు ఈరోజు : ఈడీ ఏం చెప్పింది..!❓️
లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన కేసు ఇవాళ జరిగిన వాదనల్లో ఈడీ తరఫు న్యాయవాదులు సుదీర్ధ వాదనలు వినిపించారు. ‘ లిక్కర్ పాలసీ ద్వారా పెద్ద కుంభకోణమే జరిగింది. అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి. కవితకు సంబంధించిన వ్యక్తిగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారు. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో ప్రాపర్టీలు కొన్నారు. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి కవితతో పలుమార్లు సమావేశాలు జరిగాయి.
ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబులు హైదరాబాద్‌లో ప్రాపార్టీలు కొన్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై నోటీసులు ఇచ్చి విచారణ జరిపాం’ అని కోర్టుకు ఈడీ స్పష్టం చేసింది. మరోవైపు.. తమ వాదన వినిపించేందుకు సమయం కావాలని పిళ్లై తరపు న్యాయవాది కోరారు. ఎందుకిలా రోటీన్ వాదనలు చేస్తున్నారని జస్టిస్ నాగ్‌పాల్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను జూన్- 2కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
ఇదీ అసలు కథ..!
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుపై మంగళవారం నాడే రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన నాల్గవ అనుబంధ చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మే-04న లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో నాలుగవ అనుబంధ చార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా మనీష్ సిసోడియాపైనే ఈడీ అభియోగాలు మోపింది. అంతేకాదు.. ఈ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. కవిత విషయంలో గత చార్జ్‌షీట్‌లో మోపిన అభియోగాలు, అంశాలనే మరోమారు ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూపులో కవిత ఉన్నారని.. ఆ గ్రూప్‌కు- ఆప్ నేతలకు మధ్య ఒప్పందం ఉందని ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూపునకు లబ్ధి చేకూర్చేలా సిసోడియా విధాన రూపకల్పనలో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయితే ఇలా లబ్ధి చేకూర్చినందుకు గాను సౌత్ గ్రూప్ నుండి ఆప్ నేతలకు ముడుపులు ముట్టాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది.
అంతా రోటీన్..!
లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో కవితను సీబీఐ, ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. నిందితులను కవిత కలిశారని.. సమావేశం కూడా అయ్యారని.. మాట్లాడారని ఇలా పలు అభియోగాలనే గతంలో దర్యాప్తు సంస్థలు మెపాయి. తాజా అభియోగపత్రంలోనూ ఇదే విషయాలను ఈడీ పునరుద్ఘాటించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రశ్నించిన 51 మంది వివరాలను అభియోగ పత్రాల్లో ఈడీ పేర్కొంది. అయితే.. ఈడీ ప్రశ్నించిన జాబితాలో మొన్న కవిత పేరు లేకపోగా ఈసారి మాత్రం ఉంది. కాగా.. గతంలో కవితను మూడుసార్లు విచారణకు ఈడీ పిలిచి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. నిందితులతో కవిత పలుమార్లు హైదరాబాద్, ఢిల్లీలో సమావేశమయ్యారని.. తాను కవిత బినామీనని అరుణ్ పిళ్ళై చెప్పిన విషయం.. ఇలా రోటీన్ అభియోగాలనే మళ్లీ ఈడీ మోపినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. లిక్కర్ స్కామ్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మొన్న కవిత పేరే అస్సలు లేకపోవడం.. ఇప్పుడు మళ్లీ అభియోగాలు ఉన్నట్లు చార్జ్‌షీట్‌లో పెట్టడం బిగ్ ట్వి్స్టే అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే పలు అనుమానాలకు దర్యాప్తు సంస్థలు తావిస్తున్నాయి. అది కూడా రెండ్రోజులు వ్యవధిలోనే దర్యాప్తు సంస్థలు ఇలా రెండు మాటలు మాట్లాడాన్ని బట్టి చూస్తే మున్ముందు ఇంకా పెను సంచలనాలే వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కవిత ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి......
May 31 2023, 11:31