ఇట్లా కాలిస్తే ఎట్లా ❓️
వరి కొయ్యలను తగులబెడుతున్న రైతులు
సారం దెబ్బతింటున్నదంటున్న శాస్త్రవేత్తలు
మేలు చేసే సూక్ష్మ జీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం
పెద్దపెల్లి జిల్లా : గతంలో కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ప్రస్తుతం యంత్రాలు అందుబాటులోకి రావడంతో మొదళ్ల వరకు కాకుండా 25 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కోస్తున్నాయి. దీంతో గడ్డి కొయ్య కాళ్ల రూపంలో పంట అవశేషంగా మిగులుతున్నది. వీటిని రైతులు మడిలోనే తగులబెడుతున్నారు.
ఇది పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నది. కాల్చడం వల్ల అపార నష్టాలున్నాయంటూ శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నా మెజార్టీ రైతులు వినకుండా వరి కొయ్యలను కాల్చుతూనే ఉన్నారు. తద్వారా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లు అవుతున్నది. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోవడమే కాకుండా సారవంతమైన భూమి దెబ్బతినడంతో దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నది. వాతావరణం కలుషితమవుతున్నది.
అప్పట్లో దొడ్డినిండా పశువులు ఉండడం వల్ల వాటి మేత కోసం గడ్డిపోచను కూడా విడిచిపెట్టకుండా.. కొడవళ్లతో వరిని మొదళ్ల వరకు కోసేవారు. ఎండబెట్టి కుప్పవేసి ఏడాదంతా పశువులకు మేతగా ఉపయోగించే వారు. ఇప్పుడు పశువులు లేకుండా పోయాయి. రైతుకు గడ్డి అవసరం లేకుండాపోయింది. వరికోత యంత్రాలు వచ్చిన తదుపరి గడ్డిని కుప్పవేసే రైతులను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితులు వచ్చాయి. మారిన ప్రపంచీకరణ నేపథ్యంలో.. ప్రస్తుతం రైతులు వరిపంట కోతకు యంత్రాలను వినియోగిస్తున్నారు. పంటకు, పంటకు మధ్య సమయం తక్కువ ఉండడంతో వరికోసిన తర్వాత మిగిలిన కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవడంపై రైతులకు అవగాహన లేకపోవడంతో పొలంలో ఉన్న కీటకాలను, వ్యాధికారక జీవులు నశింపచేయవచ్చన్న అపోహతో చాలా మంది రైతులు వరి కొయ్య కాళ్లను, గడ్డిని తగులబెడుతున్నారు.
తగులబెట్టడం వలన అనేక నష్టాలు
వరి కొయ్యలను తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. ఉత్తర భారతదేశంలో ఈ కారణంగా శీతాకాలంలో తీవ్రస్థాయిలో కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా సూక్ష్మజీవులు పంటకు వేసే ఎరువులను మొక్కలకు అందిస్తాయి. కానీ కొయ్యలను తగులపెట్టడంతో అవి చనిపోవడంతో రైతులు వేసే ఎరువులు మొక్కకు అందే అవకాశం లేకుండాపోతున్నది. కొయ్యకాళ్లను కాల్చడం వల్ల నేలలోని సేంద్రీయ కర్బనం, కార్బన్‌డైఆక్సైడ్‌గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతున్నది. పొగ, ధూళికణాలు గాలిలో కలవడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే పొలాల్లో తిరిగే ముంగిసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక జీవరాసులు చనిపోతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. ఇది సాగుకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
కలియ దున్నినా..కుప్ప పెట్టినా.. బంగారమే
వరిపంట కోసిన వెంటనే కొయ్యకాళ్లను తగులబెట్టకుండా పొలంలో మిగిలిన తేమను ఉపయోగించుకుని దున్నాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దున్నడం వల్ల కొయ్యకాళ్లు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇలా చేయడం వల్ల వేసవిలో నేలలో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి తొలకరిలో పడిన వర్షపునీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేలకోతకు గురికాకుండా ఉంటుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదలకు 18.9 కిలోల పోటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్ని తిరిగి నేలకు చేరతాయి. లేదా ఈ పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. వానాకాలంలో దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేస్తే నేలలో మిగిలిపోయిన వరికొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత నాటే వరి పంటకు నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. ఈవిధానంపై ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నా, క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది......
May 30 2023, 11:20