దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ గ్రంథాలయాలను ఏర్పాటు చేసామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీ. ఎం. మందపాటి శేషగిరిరావు అన్నారు.విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో రాష్ట్రంలోని గ్రంథాలయ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుస్తకాల కొనుగోలు, డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటు బడ్జెట్ ప్రతిపాధనలపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఛైర్మన్ శేషగిరి రావు మాట్లాడుతూ ప్రతి పేద వానికి విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించాలని లక్ష్యంతో విద్యా శాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దక్కుతుందన్నారు. అన్ని గ్రామల్లో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్య మంత్రి ఆలోచనలకు అనుగుణంగా రూ.450 కోట్లతో 10,960 డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కడపలో మొదటి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామన్నారు, పల్లె పల్లెకు విజ్ఞాన వీచికలు అందాలనే లక్ష్యంతో గ్రంథాలయాలను బలోపేతం చేస్తున్నమన్నారు.
రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలలో ఏప్రిల్ 5 నుండి విజనరీజగన్ పేరుతో సెమీనార్‌లు నిర్వహిస్తున్నామన్నారు. గత సంవత్సరం బడ్జెట్ లో రాష్ట్రంలో గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలు చేయుటకు రూ.15.75 కోట్లు కేటాయించామన్నారు, ఇప్పటి వరకు రూ.10 కోట్లతో పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయాలకు అందించామన్నారు. గత పది సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రాంలోని గ్రంథాలయాలను నిర్వీర్యం చేసాయన్నారు.
సామాజిక, విజ్ఞాన విషయాలకు సంబంధించి కొత్తగా ప్రచురింపబడిన (2021,2022,2023 సం//ల) పుస్తకాల నమూనా ప్రతులను రచయితలు, ప్రచురణ కర్తలనుండి కోరుచున్నామన్నారు. ఈ నెల 27 నుండి ఏప్రిల్ 26 వరకు రచయితలు, ప్రచురణకర్తల నుండి పుస్తకాలు నమూన ప్రతుల రిజిస్ట్రేషన్ కొరకు పుస్తకాల శాఖా గ్రంథాలయ భవనం, మొదటి అంతస్తు, శివాలయం ప్రక్కన, మెట్ల బజార్, పౌర గ్రంథాలయ సంచాలకుల వారి కార్యాలయం, మంగళగిరి నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో (పని దినాలు) ఉ.11. గంటల నుండి సా. 4. గంటల వరకు నమూన ప్రతులు, పోస్ట్ ద్వార గాని, స్వయంగా గాని అందజేయవచ్చునన్నారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టంలోని నిబంధనల (సెక్షన్-9) 1867 ప్రకారం ముద్రించిన పుస్తకాలు మూడు ప్రతులను అందజేయవలసి ఉందన్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్ధూ, సంస్కృతం, కన్నడ తమిళం మరియు ఒరియా సంబంధించి ప్రచురించబడిన పుస్తుకాలు ఈ ఎంపికకు అవసరమైవున్నవని. ఛైర్మన్ శ్రీ. ఎం. మందపాటి శేషగిరిరావు అన్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ సభ్యులు జి. మహేష్, శ్రీమతి రెడ్డి పద్మావతి, వై. నరసింహరావు, అమిరుద్దీన్, పౌర గ్రంథాలయ సంస్ధ, ఉప సంచాలకులు సి. శ్రీనివాస రెడ్డి, 13 ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు
రాష్ట్ర సమాచార కేంద్రం విజయవాడ వారిచే జారీ చేయబడినది.
Mar 28 2023, 21:37