పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు
పాలమూరు జిల్లాలో ఎండుతున్న పంటలు
మహబూబ్‌నగర్, : యాసంగి పంటలకు కష్టాకలం వచ్చింది. సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కెనాల్స్‌కు నీటి విడుదల లేకపోవడం, ఎండలు ముదరడంతో గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. దీని ప్రభావంతో పాలమూరు జిల్లాలో పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. మరో నెల రోజుల పాటు నీరు అవసరం ఉండడంతో, రైతులు పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ యాసంగిలో 3 లక్షల ఎకరాల్లో వరి, మక్కలు, పత్తి, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిడ్జిల్ మండలానికి మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఎంజీకేఎల్ఐ) ద్వారా, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని కొన్ని ఏరియాలకు కోయిల్‌సాగర్ కెనాల్స్ ద్వారా సాగు నీరందుతుంది. మహబూబ్‌నగర్, భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట, బాలానగర్, నవాబ్‌పేట, జడ్చర్ల, రాజాపూర్, కోయిల్‌కొండ మండలాల్లో బోర్ల ఆధారంగానే వరి వేసుకున్నారు. అయితే, వానాకాలం వడ్ల కొనుగోళ్లు లేట్ కావడంతో యాసంగి రెండు నెలలు ఆలస్యమైంది. అక్టోబరులో వరి నార్లు పోసుకోవాల్సి ఉండగా, జనవరిలో నార్లు పోసుకున్నారు. కొందరు రైతులు అక్టోబరులో నార్లు పోసుకున్నా.. వరి పైర్లపై చలి ప్రభావంతో పంటలు ఎదగలేదు. దీంతో వీరు కూడా పంటను తీసేసి, జనవరిలో మరోసారి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం ఈ పంటలన్నీ కంకి పట్టే దశలో ఉన్నాయి. పాల దశకు చేరుకోవడానికి మరో రెండు వారాల టైం పడుతుంది. ఇంకా నెల రోజులు సాగునీరు అందించాల్సి ఉంది.
కాల్వలకు నీళ్లు బంద్..
ఎంజీకేఎల్ఐ కాల్వ కింద సాగు చేసిన వరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారబందీ ప్రకారం నీళ్లు వదులుతుండడంతో మిడ్జిల్ మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కెనాల్ ఎండిపోయింది. ఈ కెనాల్లో అక్కడక్కడా నీరు నిల్వ ఉండగా, రైతులు మోటార్లతో ఎత్తిపోసుకొని పంటలను కాపాడుకుంటున్నారు. కోయిల్‌సాగర్ కింద రైట్, లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ద్వారా పంటలకు పది రోజులకోసారి నీటిని విడుదల చేస్తున్నా.. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మరో పది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఈ కెనాల్స్ పరిధిలోని వరి, తోటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది.
బోర్లు పోస్తలేవు..
యాసంగిలో జిల్లాలో బోర్ల ఆధారంగానే రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 2018 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడంతో బోర్లపై ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీలుగా నమోదమయ్యాయి. మార్చి రెండో వారం నుంచి ఎండలు మరింత పెరగడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దాదాపు 80 వేల ఎకరాలు బోర్ల కింద సాగవుతుండడం, అందరూ ఒకేసారి మోటార్లను ఆన్ చేస్తుండడంతో గ్రౌండ్ వాటర్ త్వరగా పడిపోతోంది. ఇప్పటికే జిల్లాలో 1.16 మీటర్ల లోతుకు నీరు పడిపోగా రానున్న రెండు వారాల్లో గ్రౌండ్ వాటర్ మరింత లోతుకు పడిపోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఒక బోరులో నీళ్లు వస్తలే..
నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉన్నాయి. బోర్ల ఆధారంగా ఆరెకరాల్లో డిసెంబరులో వరి వేసిన. ఇప్పుడు కంకి దశలో ఉంది. ఈ టైంలో బోర్లల్లో నీళ్లు వస్తలేవు. ఇప్పటికే ఒక బోరు బంద్ అయింది. ఉన్న ఒక్క దాంతోనే పంటను కాపాడుకోవాలి.
–పి.రాములు, అమ్మాపూర్
వంకాయ తోట వదిలేసిన..
నాకు ఎకరా పొలం ఉంది. బోరు ఉందని అర ఎకరంలో టమాట, మిగిలిన అర ఎకరంలో వంకాయ తోట పెట్టిన. పది రోజుల నుంచి బోరు పోస్తలేదు. దీంతో వంకాయ తోటను వదిలేసిన. టమాట తోటకు అరకొరగా నీరు అందిస్తున్న. వారం రోజులు అయితే ఈ బోరు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది.
–కొత్తకోట గోవర్ధన్, చిన్నచింతకుంట.
Mar 28 2023, 13:14