గ్రామీణానికి వరం బార్క్ నీటి శుద్ధి పరిజ్ఞానం.
గ్రామీణానికి వరం బార్క్ నీటి శుద్ధి పరిజ్ఞానం.
రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, మార్చి 23: బాబా అణు పరిశోధనా కేంద్రం (బార్క్) అభివృద్ధి చేసిన నీటి శుద్ధి పరిజ్ఞానం సాయంతో అతి తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాలకు శుద్ధిచేసిన, సురక్షితమైన తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పీఎంవో శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధిచేసిన తాగునీరు అందించే లక్ష్యంతో ఆకృతి ప్రోగ్రాం పేరిట కేంద్ర ప్రభుత్వం అనేక మంది గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ ఆధారిత నీటిశుద్ధి సాంకేతికతను బదలాయించినట్లు తెలిపారు.
బార్క్ అభివృద్ధి చేసిన నీటిశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం ఏఏ రాష్ట్రాల్లో విస్తరించింది? ఏ టెక్నాలజీ ఎంత ధరలో అందుబాటులో ఉన్నాయి? చౌకగా తాగు నీటిని శుద్ధి చేసే ఈ టెక్నాలజీని వాణిజ్యపరం చేసే ఆలోచన ఉందా అంటూ శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ వినూత్న నీటి శుద్ధి పరిజ్ఞానం గురించి వివరించారు. బార్క్ రూపొందించి నీటిశుద్ధి సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో విస్తరించినట్లు తెలిపారు. అలాగే వాణిజ్యపరంగా దీనిని విస్తరించేందుకు 14 పైగా ప్రైవేటు సంస్థలకు వివిధ రకాల టెక్నాలజీలను బదలాయించినట్లు తెలిపారు.
ఆయా ప్రాంతాల్లో నీటి నాణ్యత ఆధారంగా ఏ విధమైన నీటిశుద్ధి టెక్నాలజీని వినియోగించాలో నిర్ణయించిన మీదట దానిని విస్తరిస్తారని మంత్రి తెలిపారు. నీటిలో సూక్ష్మక్రిములతో నిండిన కాలుష్యం, మలినాలను తొలగించేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ టెక్నాలజీని, నీటిలో ఆర్సెనిక్/ ఐరన్ వంటి కాలుష్యాన్ని తొలగించేందుకు ఫిజికో కెమికల్ ప్రాసెస్ అసిస్టెడ్ ఆల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్ టెక్నాలజీని, ఉప్పుతోపాటు అనేక రకాల కాలుష్యాలు తొలగించేందుకు బ్రాకిష్ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆధారిత మెంబ్రేన్ టెక్నాలజీ, టీడీఎస్ 5000 నుంచి 35000 పీపీఎం వరకు తొలగించేందుకు సీ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ ఆధారిత మెంబ్రేన్ టెక్నాలజీని బార్క్ రూపొందించినట్లు తెలిపారు.
బార్క్ రూపొందించిన మెంబ్రేన్ ఆధారిత నీటిశుద్ది సాంకేతిక పూర్తిగా స్వదేశీయమైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని మంత్రి తెలిపారు. ఈ టెక్నాలజీల ఆధారంగా రూపొందించిన డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్స్ మార్కెట్లో లభ్యమయ్యే వాణిజ్యపరమైన రకాలతో పోల్చిచూస్తే 30%-40% వరకు తక్కువ ధరలో అందిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లో కుళాయికి అమర్చే డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫైర్ 5 వేల రూపాయలు, గంటకు 10 లీటర్ల నీటిని శుద్ధిచేసే సామర్ధ్యం గల బీడబ్ల్యుఆర్ఓ-పీఓయూ వాటర్ ప్యూరిఫైర్ 10 వేలు, కమ్యూనిటీ సైజ్ యూఎఫ్ ఆధారిత ఆర్సెనిక్/ ఐరన్ రిమూవల్ యూనిట్ 10 లక్షలు, బీడబ్ల్యుఆర్ఓ మెంబ్రేన్ ఆధారిత కమ్యూనిటీ సైజ్ ఆర్ ఓ యూనిట్ 12 నుంచి 15 లక్షలు, గంటకు 10 వేల లీటర్ల నీటని శుద్ధి చేసే సామర్ధ్యం కలిగిన ఎస్‌డబ్ల్యుఆర్‌ఓ మెంబ్రేన్ ఆధారిత కమ్యూనిటీ సైజ్ ఆర్వో యూనిట్ 70 నుంచి 85 లక్షల మధ్యలో లభిస్తుందని మంత్రి తెలిపారు.
----------------------------------------------------------
Mar 23 2023, 18:10