ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలపై అత్యాచారం చేసిన ఎన్నారై

మహిళలపై అకృత్యాలు ఆగట్లేదు. తాజాగా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసి.. 13మందిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎన్నారై. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూలకు పిలిపించి.. మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. 

ఈ అకృత్యాలను వీడియో తీసి బెదిరించేవాడు. అతడు ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్‌కర్. ఇతడికి కొరియా మహిళంటే పిచ్చి. ఇతడిచే బాధితులైన వారు ఎక్కువ కొరియా మహిళలే. 

2018 నుంచి ఇతడు ఇలా 13 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 అక్టోబరులో పోలీసులు ఇతడి సొంత ఫ్లాటులో జరిగిన సోదాల్లో మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్, బాటిల్స్, వీడియోలతో పాటు 47 వీడియోలతో కూడిన హార్డ్ డ్రైవ్ దొరికింది. ఇక బాలేశ్ నేరాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఉద్యోగం చేస్తా అందుకు కొడలిపై దాడి చేసిన మామా... ఎక్కడంటే...?

మహిళలు రాకెట్లలో అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నా.. అకృత్యాలు, వివక్ష ఏమాత్రం తగ్గడం లేదు. తను కూడా ఏదో ఒక పనిచేస్తానని ఇంటర్వ్యూకు వెళ్లడానికి సిద్ధమైన మహిళపై ఆమె సొంత మామ దారుణంగా దాడి చేశాడు. ఢిల్లీలోని ప్రేమ్ నగర్‌లో మంగళవారం ఈ సంఘటన జరిగింది. 

కాజల్, ప్రవీణ్ కుమార్ దంపతులు. ప్రవీణ్ చిరుద్యోగి. తను కూడా ఏదో ఒక జాబ్ చేస్తానని కాజల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటోంది. భర్త సరేనన్నా మామకు గుర్రుగా ఉంటున్నాడు. 

జాబ్ చేస్తే ఇంటి పరువు పోతుందన్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇటుకపెళ్లతో దాడి చేశాడు. ఆమె నడినెత్తిపై బాదాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. స్థానికులు ఆమెను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు 17 కుట్లుపడ్డాయి. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.

అరె ఫుళ్లుగా తాగి పెళ్లి మరిచిన పెళ్లి కొడుకు... తరువాత ఏమైందంటే...

బీహార్‌లో మద్య నిషేధం అమలులో ఉంది. అయినా మద్యపాన సేవనం ఆగట్లేదు. ఫలితంగా మద్యం మత్తులో జీవితాలను కోల్పోతున్నారు. భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తంగంజ్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఒక యువకుడు తన పెళ్లి ఊరేగింపుకు వెళ్లడం మర్చిపోయాడు. 

మరుసటి రోజు మత్తు తగ్గడంతో బంధువుల ఒత్తిడితో పెళ్లికి వెళ్లగా.. ఆపై పెళ్లికి యువతి నిరాకరించింది. అంతేకాదు పెళ్లికి చేసిన ఖర్చును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెళ్లికొడుకును, అతని సహోద్యోగిని కూడా బందీలుగా ఉంచారు యువతి బంధువులు. 

విషయం బయటకు పొక్కడంతో పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లికి ముందు పెళ్లికొడుకు మద్యం సేవించాడు. అంతే స్పృహ కోల్పోయాడు. అంతే పెళ్లి ఊరేగింపుకు రాలేకపోయాడు. పదేపదే కాల్ చేసినప్పటికీ, పెళ్లి కొడుకు వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. 

ఊరేగింపు సోమవారమే వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం వరకు కూడా చేరుకోలేదు. మరుసటి రోజు, అమ్మాయి తరపువారు సంప్రదించడంతో, బంధువుల ఒత్తిడితో, వరుడు ఎలాగోలా పెళ్లికి సిద్ధమయ్యాడు.

తన సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం వధువు ఇంటికి చేరుకున్నాడు. కానీ ఈసారి అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి తరఫు వారు వరుడిని, అతని సహాయకుడిని బందీలుగా ఉంచి పెళ్లికి ఖర్చు చేసిన డబ్బును డిమాండ్ చేశారు.

రాహుల్ గాందీ కేంబ్రిడ్జ్ ప్రసంగంపై రచ్చ ... క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్...

లండన్‌ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్‌ ప్రసంగంపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తన దాడిని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేతపై వ్యాఖ్యలపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

విదేశీ గడ్డపై భారత్ పరువు తీశారని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని కాషాయ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ప్రకటనలను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కోరారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు, ప్రజాస్వామ్యం, దేశ వ్యవస్థలను అవమానించడమేనని బీజేపీ వాదించింది. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని ముగించేందుకు కమిటీ పరిశీలించాలని దూబే అన్నారు.

దీని గురించి మాట్లాడుతూ నిషికాంత్ దూబే 2005 నాటి ప్రత్యేక కమిటీ గురించి ప్రస్తావించారు. ఇది పార్లమెంటు ప్రశ్నల కుంభకోణానికి సంబంధించిన నగదును పరిశీలించి, 11 మంది ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేసింది. వారు పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీశారని కమిటీ తెలిపిందని, ఆ కమిటీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని దూబే చెప్పారు. యూరప్, అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కారణంగా పార్లమెంటు, దేశ గౌరవం నిరంతరం మసకబారుతున్నాయని.. అందువల్ల ఆయనను పార్లమెంటు నుంచి బహిష్కరించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. 

గత వారం కూడా, కాంగ్రెస్ నాయకుడిపై తన ప్రత్యేక హక్కు నోటీసుపై పార్లమెంటరీ ప్యానెల్ ముందు నిలదీస్తూ, లోక్‌సభ నుంచి రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని దూబే కోరినట్లు తెలిసింది. హిండెన్‌బర్గ్-అదానీ సమస్యపై వ్యాఖ్యానించిన బడ్జెట్ సెషన్‌లోని మొదటి భాగంలో రాహుల్‌ గాంధీ ప్రసంగంపై ఎంపీ ప్రివిలేజ్ నోటీసును తరలించారు. ఈరోజు తెల్లవారుజామున ఎనిమిది మంది కేంద్ర మంత్రులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పార్లమెంట్ హౌస్‌లో కలిశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించారు.

రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయడం, క్షమాపణలు చెప్పడానికి కాంగ్రెస్ నిరాకరించడం బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో పార్లమెంటులో గందరగోళానికి కారణమైంది. రాహుల్‌ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పే ప్రస్తక్తేలేదని కాంగ్రెస్‌ తేల్చి చెబుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా రాహుల్‌ గాంధీ స్పందించారు. తనెలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదని లోక్‌సభ ఎంపీ స్పష్టం చేశారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ‘నేను ఎలాంటి దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు. 

విదేశాల్లో భారత్‌ను అవమానించానంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు స్పందించాల్సి వస్తే.. నాకు మాట్లాడానికి అనుమతి ఇస్తే సభలోనే మాట్లాడతాను’ అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దేశం సాధించిన విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనల్లో తరచూ దాడి చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

తాజాగా బ్రిటన్ లో కూడా ‘టిక్‌టాక్‌’ పై నిషేదం.

చైనా యాప్‌ ‘టిక్‌టాక్‌’కు మరో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే పలు దేశాల్లో బ్యాన్ అయిన ఈ యాప్ తాజాగా బ్రిటన్ లో నిషేధించారు. అయితే పూర్తిగా మాత్రం కాదు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఫోన్‌లలో ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు బ్రిటన్‌ వెల్లడించింది. మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ప్రకటన చేశారు.

‘ప్రభుత్వ సమాచారాన్ని టిక్‌టాక్‌ ఏ విధంగా వినియోగిస్తోందోనన్న విషయంలో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వానికి చెందిన సున్నితమైన సమాచార భద్రతకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి, ప్రభుత్వ పరికరాల్లో ఈ యాప్‌ను నిషేధిస్తున్నాం. సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. డేటాను యాక్సెస్‌ చేసే ఇతర యాప్‌లపైనా దృష్టి సారించాం. థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ల నిర్వహణపై ప్రభుత్వ విధానాన్ని బలోపేతం చేస్తాం’ అని డౌడెన్‌ అన్నారు.

బ్రిటన్‌లో ప్రస్తుతం ప్రభుత్వ పరికరాల్లో టిక్‌టాక్ వినియోగం పరిమితంగా ఉంది. తాజాగా దాన్ని పూర్తిగా నిషేధించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని డివైజ్‌లకు ఇది వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, సాధారణ ప్రజల వ్యక్తిగత పరికరాలపై ఈ నిషేధం ఉండదు. ఇంటర్నెట్‌ దుర్వినియోగం వంటి అంశాలపై పనిచేసే ప్రభుత్వ విభాగాల్లోని ఫోన్‌లలో టిక్‌టాక్ వినియోగానికి నిర్దిష్ట మినహాయింపులు కల్పిస్తున్నట్లు క్యాబినెట్ కార్యాలయం తెలిపింది.

ఆయుధాల కొనుగోలుకు రూ.70 వేల కోట్ల రక్షణశాఖ డీల్

ఆయుధ సామాగ్రి కొనుగోలుకు కేంద్ర రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు వివిధ ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసేందుకు రూ.70 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలకు రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. 

భారత నౌకా దళానికి 60 మేడ్ -ఇన్-ఇండియా యుటిలిటీ హెలికాప్టర్లు మెరైన్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు (BrahMos missiles), భారత సైన్యం కోసం 307 ATAGS హోవిట్జర్లు, 9 ALH ధృవ్ ఛాపర్‌ల (Dhruv choppers)ను కొనుగోలు చేసే ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh ) నేతృత్వంలోని మండలి సమావేశం ఆమోదం తెలిపింది.

ఈ డీల్‌లో హెచ్‌ఏఎల్ నుంచి 60 యూహెచ్ మెరైన్ చాపర్‌లను కొనుగోలు చేసేందుకు భారత నావికాదళానికి రూ.32 వేల కోట్ల మెగా ఆర్డర్ కూడా ఉందని అధికారులు తెలిపారు. భారత నౌకాదళానికి రూ. 56 వేల కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణులు, శక్తి ఈడబ్ల్యూ సిస్టమ్స్, యూటీలిటీ హెలికాప్టర్లు- మారీమ్ అనుమతి లభించింది.

టీ ఇవ్వలేదని భార్యపై యాసిడ్ పోసిన భర్త

టీ ఇవ్వలేదని భార్యపై మద్యం మత్తులో భర్త యాసిడ్‌ పోసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. 

ఈ కేసులో నిందితుడైన భర్తను నడి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వికలాంగుడు, మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఈ దాడిలో భార్య గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన మరౌనా బ్లాక్‌లోని లాల్మానియా గ్రామంలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. నిందితుడు మొదట మద్యం బాటిళ్లతో ఇంటికి వచ్చాడు. మద్యం బాటిళ్లను ఖాళీ చేసి ఆ తర్వాత దంపతులిద్దరు కలిసి తిన్నారు. తర్వాత టీ ఇవ్వమని భార్యను అడిగాడు.

భార్య గ్యాస్‌పై టీ పెట్టింది. అయినప్పటికీ నిందితుడు వంటగదిలోకి వెళ్లి బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ యాసిడ్‌ భార్య ముఖంపై పోశాడు. మహిళ గొంతు విని ఇరుగుపొరుగు వారు పరుగున వచ్చారు. 

బాధితురాలి సమాచారం ప్రకారం, ఆమె మూడు రోజుల క్రితం తన భార్య ముఖంపై వేడి చేయని యాసిడ్ పోశాడు. ఆ సమయంలో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. 

అయితే ఈరోజు హాట్ యాసిడ్ పోసి తీవ్రంగా గాయపడింది. దీంతో మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగులు తీశారు. వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు.

కూలిన ఆర్మీ హెలీకాప్టర్.. లెఫ్టినెంట్ కల్నల్ మృతి

అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్‌డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. పైలట్ల జాడ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. గురువారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో ఆపరేషన్ సమయంలో ఆర్మీ ఏవియేషన్‌కు చెందిన చితా హెలికాప్టర్‌కు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్ తెలిపారు. హెలికాప్టర్ తరువాత బొండిలాకు పశ్చిమాన మండల్ సమీపంలో కూలిపోయినట్లు గుర్తించారు. పైలట్‌ల కోసం ఆర్మీ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ ప్రారంభించింది.

గతేడాది అక్టోబర్‌ 5న అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆర్మీ చితా హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు కాగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం 10 గంటల సమయంలో తవాంగ్‌లోని జెమిథాంక్ సర్కిల్‌లోని బాప్ టెంగ్ కాంగ్ జలపాతం సమీపంలోని న్యామ్‌జాంగ్ చు వద్ద ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సురవ సాంబ ప్రాంతం నుంచి ఇద్దరు పైలట్లతో హెలికాప్టర్లు నిత్యం సంచరిస్తుంటాయి.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది, ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్‌లను బయటకు తీసి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పైలట్లలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించారు. తవాంగ్‌లో ఇది మొదటి హెలికాప్టర్ ప్రమాదం కాదు. 2017లో వైమానిక దళానికి చెందిన Mi-17 V5 హెలికాప్టర్ కూలి ఐదుగురు IAF సిబ్బంది మరియు ఇద్దరు ఆర్మీ అధికారులు మరణించారు.

హర్యానా గురుగ్రాంలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య..

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ చదివే ఓ విద్యార్ధి 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

 వివరాల్లోకెళ్తే.. గురుగ్రాంలోని సెక్టార్ 41లోని సౌత్ సిటీ 1లోని రిట్రీట్ సొసైటీలో 17 ఏళ్ల బాలుడు ఓ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్నాడు. ఫైనల్‌ టర్మ్‌ పరీక్షలు దగ్గరపడుతుండటంతో ఒత్తిడి తట్టుకోలేక తమ అపార్ట్‌మెంట్‌లో 13వ అంతస్థు బాల్కనీ నుంచి కింది దూకాడు. కింద ఏదోపడ్డ శబ్ధం రావడంతో సొసైటీ సెక్యూరిటీ గార్డులు బయటికి వచ్చి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యంకాకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని నరేంద్ర మోడీ

ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో నోబెల్‌ శాంతి బహుమతి రేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోడీకి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవల నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ భారత్ ను సందర్షించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని మోడీని ప్రశంసించారు. ఆయన ప్రపంచానికి చేస్తున్న సేవలను కొనియాడారు. యుద్ధాలు చేసే దేశాల చేత కూడా యుద్ధాలను ఆపించగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నారు. మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పే సామర్థ్యం ఉందని కితాబిచ్చారు. మోడీ లాంటి నేత శాంతిని పెంచడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే వెల్లడించారు. 

మోడీ విధానాల వల్ల భారత్ సుసంపన్నమైన, శక్తిమంతమైన దేశంగా మారుతోందని అస్లే అన్నారు. ప్రపంచాన్ని నడపగల గొప్ప అర్హత ఉన్న నాయకుడైన ప్రధాని మోడీ.. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రకటించే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంటే అది చారిత్రాత్మకం అవుతుందని చెప్పారు.