Andrapradesh

Nov 16 2020, 11:57

సలాం కుటుంబం ఆత్మహత్యపై సోము వీర్రాజు సంచలన కామెంట్స్..  

నంద్యాల సలాం ఘటనలో పోలీసులను అరెస్ట్ చేయడం సరికాదు 

తమ డ్యూటీ చేసిన పోలీసులను అరెస్టు చేస్తారా? - 

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎంని అరెస్ట్ చేస్తామా? 

నంద్యాల ఘటను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు 

సలాం కుటుంబం ఆత్మహత్యపై టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయి 

ముస్లింల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదు 

టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే మాపై హిందుత్వ ముద్ర వేస్తున్నారు 

విదేశీ విద్య పథకానికి నిధులివ్వడం లేదు 

తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది  

ఘాట్లు నిర్మించనప్పుడు రూ.200 కోట్లు ఎందుకు? 

నదిలో పుష్కరస్నానాలు చేయొద్దనడం సరికాదు  

ముంపు మండలాలపై టీడీపీ, వైసీపీ ఎందుకు మాట్లాడలేదు? 

పోలవరం నిర్మాణంపై అసత్య ప్రచారం చేస్తున్నారు 

విచ్చల విడిగా జరుగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగును అరికట్టాలి

Andrapradesh

Nov 16 2020, 09:49

ఏపీకి మళ్ళీ భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది.  

కొమరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించింది.  ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

సోమవారం రోజున దక్షిణ కోస్తాతీరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.  

గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.

Andrapradesh

Nov 15 2020, 08:15

వైద్య కళాశాలలకు భూముల కేటాయింపు

అమరావతి : రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల పేరిట పలు జిల్లాల్లో భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం కోసం  50 ఎకరాలను, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం 29.60 ఎకరాల భూమిని కేటాయించింది. అదేవిధంగా గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో 51.07 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 12.58 ఎకరాలను కేటాయించింది. కాకినాడ అర్బన్‌ మండలం రమణయ్య పేటలో 15.76 ఎకరాలను రంగరాయ వైద్య కళాశాల స్థాయి పెంపు కోసం కేటాయించింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పశు సంవర్థక శాఖకు చెందిన 48.49 ఎకరాలను బదలాయించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల కోసం ఉచితంగా భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

Andrapradesh

Nov 14 2020, 15:36

వారు దేశానికి వెలకట్టలేని ఆస్తి: సీఎం జగన్‌

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ 
జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతి రూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.* 

 చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Andrapradesh

Nov 14 2020, 15:35

ఎంపీ సుజనా చౌదరి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్.. షరతులు విధించిన హైకోర్టు

అమెరికా వెళ్లేందుకు బయల్దేరిన సుజనా చౌదరిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. నిన్న అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో సుజనా కోర్టును ఆశ్రయించగా గ్నీన్ సిగ్నల్ లభించింది. ఈ క్రమంలో సుజనా చౌదరికి రెండు వారాల పాటు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల కారణంగా ఆయన విదేశీ ప్రయణాన్ని అడ్డుకోవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది.

న్యూయార్క్ లో అనారోగ్యంతో ఉన్న తన మామను చూసేందుకు సుజనా చౌదరి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. దీంతో తనపై ఉన్న లుకౌట్ నోటీసులను సవాల్ చేస్తూ…తనను అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సుజనా చౌదరి శుక్రవారం హైకోర్టులో అత్యవసర పిటీషన్ దాఖలు చేశారు. తనను అధికారులు అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తున్నారని తెలంగాణ హైకోర్టులో ఎంపీ సుజనాచౌదరి పిటిషన్ దాఖలు చేశారు. తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై జస్టిస్ చల్లా కోదండరాం ఇంటి వద్ద విచారించారు.

సుజనా చౌదరి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెసర్స్‌ బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కేసులో మెసర్స్‌ బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారన్నారు. మరో కేసులో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారని తెలిపారు. ఈ రెండు కేసుల్లోనూ ఎలాంటి దుందుడుకు చర్యలూ తీసుకోవద్దని కోర్టులు ఆదేశాలిచ్చాయని తెలిపారు.

Andrapradesh

Nov 14 2020, 15:29

బయటికెళ్తున్నానని చెప్పి.. బావిలో దూకిన భర్త

బయటికి వెళ్తున్నానని భార్యకి చెప్పి బైక్‌పై బెంగళూరు నుంచి సొంతూరు వచ్చాడు. సరాసరి తోటలోని బావి దగ్గరికి వెళ్లి అందరికీ వాయిస్ మెసేజ్‌లు పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
 
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువకుడు సొంతూరికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శింగనమల పరిధిలోని యెల్లనూరు మండలం వెన్నపూసపల్లికి చెందిన జగన్‌మోహన్ రెడ్డి కుమారుడు లోకేశ్వర్‌రెడ్డి(24) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో కౌసల్య అనే యువతితో వివాహమైంది. వివాహానంతరం బెంగళూరులో కాపురం పెట్టారు.

రెండురోజుల కిందట మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చిన లోకేశ్వర్ రెడ్డి రాత్రి 8 గంటలకు సొంతూరు వెన్నపూసపల్లికి చేరుకున్నాడు. సరాసరి తోట వద్దకు చేరుకుని బైక్ పక్కన పెట్టాడు. తన తల్లిదండ్రులు, భార్యని బాగా చూసుకోవాలంటూ తన బంధువులకు వాయిస్ మెసేజ్‌లు పెట్టాడు. అది విన్న బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనగా తోట వద్దకు వచ్చి వెతికారు.
తోటలోని బావి వద్ద లోకేశ్వర్ రెడ్డి పర్సు లభించడంతో అందులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించి నీటిని తోడేయడంతో లోకేశ్వర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పర్యవేక్షించారు. అయితే లోకేశ్వర్ రెడ్డి ఆత్మహత్య గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. పెళ్లైన ఏడాదికే భర్త మరణంతో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.

Andrapradesh

Nov 14 2020, 08:48

ఏపీ ఆలయాల్లో స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకలు.. జగన్ సర్కారు సంచలన ఆదేశాలు

ఏపీలో ఈ నెల 18న ఏపీలోని పలు దేవాలయాల్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జన్మదినం జరగనుంది.
విశాఖపట్నం శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్ని జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన ఆయన జన్మదినం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు.

శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన మెమో పంపారు. ఈ నెల 9న విశాఖ శారదా పీఠం మేనేజర్‌ లేఖ రాసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయా దేవాలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వరూపానందేంద్ర స్వామి జన్మదినాన్ని దేవాలయాల్లో జరపాలని ఆదేశించడంపై చర్చనీయాంశమైంది. ఇటీవలే స్వరూపానంద స్వామి, శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్రలకు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని తిరుమల తీసుకువెళ్లారు. ఓ పీఠాధిపతికి అదనపు ఈవో, పాలకమండలి సభ్యుడు స్వాగతం పలికాడంపై విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నుంచి ప్రభుత్వం బయటపడకముందే తాజాగా, స్వరూపానంద విషయంలో మరో ఆదేశాలు చేసింది. కాగా, గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వరూపానందేంద్ర సరస్వతి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అలాగే సీఎం జగన్ కోసం ఆయన ప్రత్యేక పూజలు, హోమాలు సైతం నిర్వహించారు.

Andrapradesh

Nov 14 2020, 08:44

హైటెక్‌సిటీ యాక్సిడెంట్‌లో సంచలన విషయాలు.. బెంజ్ కారు ఆ వైసీపీ నేతదే.. 

Madhapur Car Accident: గురువారం అర్ధరాత్రి మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద మెర్సిడిస్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ జంప్ చేసిన కారు బులెట్ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
 
హైటెక్ సిటీ రోడ్డు ప్రమాదంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. మ‌ద్యం మ‌త్తులో కారును కాశీ విశ్వనాథ్, కౌశిక్ నడిపాడు. కౌశిక్ సిగ్నల్ జంప్ చేసి వేగంగా కారును న‌డిపి బైక్‌ను ఢీ కొట్టాడు.ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న గౌత‌మ్ అక్కడిక్కడే చ‌నిపోగా, శ్వేత హ‌స్పటల్‌లో చికిత్స పొందుతుంది. ప్రమాదానికి కార‌ణ‌మైన కారు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే కుమారినిది పోలీసులు గుర్తించారు.

కాట‌సాని ఓబుల్ రెడ్డి పేరుతో కారు వివ‌రాలు పోలీసులు సేకరించారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా పోలీసులు కారు య‌జ‌మాని కాట‌సాని ఓబుల్ రెడ్డికి నోటీసులు పంప‌నున్నారు. ఈయన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు. యాక్సిడెంట్ చేసిన కారును అక్కడే వ‌దిలేసి విశ్వనాథ్, కౌశిక్ ఓయో రూమ్‌కు వెళ్లిపోయారు. కాశీ విశ్వనాథ్‌పై గ‌తంలో అబిడ్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా న‌మోదు అయ్యింది. గ‌తంలోనే విశ్వనాథ్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పోలీసులు ర‌ద్దు చెయ్యాల‌ని రవాణ శాఖ‌కు లేఖ పంపించారు. పోలీసుల అదుపులో కాశీ విశ్వనాథ్ ఉన్నాడు. కానీ అతని స్నేహితుడు కౌశిక్ పరారయ్యాడు. కౌశిక్, విశ్వనాథ్ ఇద్దరు జూబ్లీహిల్స్‌లోని ప‌బ్బులో అర్ధరాత్రి వ‌ర‌కు మ‌ద్యం సేవించారు.

Andrapradesh

Nov 14 2020, 08:38

తిరుపతి అలర్ట్: చిన్న పాపతో దిమ్మతిరిగే స్కెచ్.. ఈ బిచ్చగాళ్లతో జాగ్రత్త!

తిరుపతిలో కొత్త రకం దొంగతనం వెలుగుచూసింది. బిచ్చగాళ్ల రూపంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో సరికొత్త రీతిలో దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. బిచ్చగాళ్ల ముసుగులో ఉన్న ఓ కుటుంబం దొంగతనాలు చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికింది. తిరుపతి లీలా మహల్‌ సెంటర్‌ కూడలిలోని లక్ష్మీవెంకటేశ్వర స్టీల్‌ దుకాణంలోకి ఇద్దరు మహిళలు ముగ్గురు పిల్లల్ని వెంటేసుకుని వచ్చారు. నేరుగా దుకాణంలోని వ్యక్తి దగ్గరకు వచ్చి దానం చేయాలంటూ చేయి చాపారు. దుకాణం యజమాని ఏదో సర్ది చెప్పబోతున్నా వదల్లేదు.


తిరుపతి: బిచ్చగాళ్ల దిమ్మతిరిగే స్కెచ్.. 
ఆ ఇద్దరు మహిళలు దుకాణ యజమానిని చుట్టుముట్టి గందరగోళంలోకి నెట్టారు. తమపై ఉన్న దుప్పట్టాలను వెడల్పుగా చేశారు. ఎదుగా ఉన్న వ్యక్తికి తమ వెనుక ఏం జరుగుతుందో కనిపించకుండా తమపై ఉన్న దుప్పట్లను అడ్డుపెట్టారు. అదే సమయంలో మహిళలతో పాటు వచ్చిన ఓ చిన్న పిల్ల చేతివాటం ప్రదర్శించింది. వారి వెనుక గుండా మరో బెంచి కింద దూరి, ఆ డెస్క్‌లో ఉన్న డబ్బు దోచేసింది. మొత్తం రూ. 1.50 లక్షలు పోయాయని బాధితుడు వాపోయాడు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వారి స్కెచ్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఇదంతా పక్కా ప్రణాళికతోనే చేసినట్లు పోలీసులు, దుకాణం యజమాని భావిస్తున్నారు.
మహిళలు యజమాని దృష్టిని మరలించగానే పని కానిచ్చేలా పిల్లలను ముందే సిద్ధం చేసినట్లు దృశ్యాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.కాగా, రూ. లక్షన్నర చోరీపై కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andrapradesh

Nov 13 2020, 19:22

కదిరి పట్టణంలో... మద్యం మత్తులో తలెత్తిన గొడవలతో ఒకరి హత్య

- స్వయాన బంధువులే నిందితులు

- రంగంలోకి దిగిన పోలీసులు... దర్యాప్తు ముమ్మరం

- ఆస్తి గొడవలు లేదా అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనా

 అనంతపురం: 

కదిరి పట్టణంలో మద్యం మత్తులో తలెత్తిన గొడవలతో గురువారం రాత్రి ఒకరి హత్య చోటు చేసుకుంది. 

కదిరిలోని ఆర్ ఎస్ రోడ్డులో ఉంటున్న అల్లావుద్దీన్ (30 స.,) అనే వ్యక్తిని స్వయాన ఇతని బంధువులే హత్య చేశారు. 

ఇతను ... భర్తను వదిలేసిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళ తండ్రి, మరొక వ్యక్తి కలసి రాత్రి అల్లావుద్దీన్ ఇంటికి వచ్చారు. 

వీరు ఫుల్ గా మద్యం సేవించారు. ఆసందర్భంగా ఈ ముగ్గురి మధ్య గొడవలు తలెత్తాయి. 

ఈ గొడవల్లో మిగితా ఇద్దరి చేతుల్లో అల్లావుద్దీన్ హతమయ్యాడు.

 కదిరి పట్టణ సి.ఐ రామకృష్ణ ఘటనా స్థలం చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. 

ఆస్తి గొడవలు లేదా అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

 త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని సి.ఐ రామకృష్ణ వెల్లడించారు.