Andrapradesh

Jun 24 2020, 13:24

అధికారంలోకి వచ్చింది పగ తీర్చుకోవడానికి కాదు’
వైకాపా ప్రభుత్వంపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ విమర్శలు

రాజమహేంద్రవరం: కరోనా వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చర్యలపై ఉండవల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌పై  సీఎం జగన్‌ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారు... ప్రెస్‌మీట్‌ పెట్టి నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడం ఘోరమైన చర్య అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదు.. అధికారంలోకి వచ్చింది పగ తీర్చుకోవడానికి కాదు అని హితవు పలికారు. ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోంది... ఎక్కణ్నుంచి అంత డబ్బు తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదు... అక్కడుంది నిమ్మగడ్డ రమేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి పేర్కొన్నారు.

Andrapradesh

Jun 24 2020, 11:30

ఆస్తుల్లో అయోధ్యరామిరెడ్డి టాప్‌

- ఆ తర్వాతే మరో వైసీపీ సభ్యుడు నత్వానీ

- అయోధ్య ఆస్తులు రూ.2,577 కోట్లు..నత్వానీవి రూ. 396 కోట్లు

★ కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో ఆత్యంత ఎక్కువ ఆస్తులు కలిగిన తొలి ఇద్దరూ.. వైసీపీకి చెందినవారే. 

★ వైసీపీ నుంచి ఎన్నికైన కార్పొరేట్‌ ప్రముఖుడు పరిమల్‌ నత్వాని కంటే కూడా మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామి రెడ్డి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. 

★ రూ. 2577 కోట్ల విలువైన ఆస్తులతో  అయోధ్యరామిరెడ్డి ఆస్తుల్లో తొలిస్థానంలో ఉన్నారు. 

★ రెండో స్థానంలో రూ. 396 కోట్ల విలువైన ఆస్తులతో పరిమల్‌ నత్వానీ నిలిచారు. 

★ ఇక రూ. 379 కోట్ల విలువైన ఆస్తులతో బీజేపీ నుంచి ఎన్నికైన జ్యోతిరాధిత్య సింథియా మూడోస్థానంలో ఉన్నారు. 

★ ఈ మేరకు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 65 సభ్యులు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసి ఏడీఆర్‌ సంస్థ నివేదిక రూపొందించింది.

★ వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ ఆస్తుల విలువ రూ.4 కోట్లు ఉండగా... మరో సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆస్తుల విలువ కేవలం రూ. 32 లక్షలు.

Andrapradesh

Jun 24 2020, 11:29

హైకోర్టుకు‌ హాజరుకానున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టులో విచారణ..

వెహికల్స్ విడుదలలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు

ప్రభుత్వ న్యాయవాది వివరణతో సంతృప్తిచెందని హైకోర్టు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కోర్టుకు హాజరుకావాలని నిన్న ఆదేశం

నేడు మరోసారి కొనసాగనున్న వాదనలు

Andrapradesh

Jun 24 2020, 08:56

నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభం

మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం 

  45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన కాపు మహిళలకు రూ.15,000 

 2,35,873 మంది కాపు మహిళలకు రూ.354 కోట్ల లబ్ధి 

తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్ కోవిడ్‌–19 లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయినప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రంగం సిద్ధం చేశారు. నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అమలు చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా అర్హులైన కాపు మహిళలు 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ చేయనున్నారు.  

 అర్హతే ప్రామాణికం* 


దారిద్య్ర రేఖకు దిగవనుండటమే ప్రామాణికంగా వైఎస్సార్‌ కాపు నేస్తం లబ్ధిదారులను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎంపిక చేసింది. ప్రాంతాలు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరినీ గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు.  

లబ్ధిదారుల పేర్లతో కూడిన జాబితాలను సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల తర్వాత తుది జాబితాలను శాశ్వత ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు.
 
కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చు.  

పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదు. 
ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ప్రభుత్వ పెన్షన్‌ పొందుతూ ఉండరాదు.

Andrapradesh

Jun 23 2020, 20:46

ఆ ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారు: అంబటి రాంబాబు

నిమ్మగడ్డ, సుజనా, కామినేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు

నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడింది

వీరి భేటీకి చంద్రబాబే సూత్రధారి


ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల భేటీపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు ముగ్గురు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వీరి భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబే సూత్రధారి అని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పటికీ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ టీడీపీ కోసం పని చేస్తున్నారని అన్నారు.

వ్యవస్థల్లోకి సొంత మనుషులను చొప్పించడం, వ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని అంబటి విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ఆయన ఎక్స్ పర్ట్ అని అన్నారు. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందని చెప్పారు. నిమ్మగడ్డ బండారాన్ని బయట పెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. హోటల్ లో జరిగిన భేటీలో ఈ ముగ్గురూ కలిసి ఎవరితో మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురి భేటీపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు.

Andrapradesh

Jun 23 2020, 20:26

మేడికుర్తిలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు 

వాలంటీర్ నిర్లక్ష్యానికి పెరుగుతున్న కరోనా కేసులు 

చిత్తూరు జిల్లా 
కలికిరి మండలం మేడికుర్తి గ్రామంలో మరో మూడు పాజిటివ్ కేసులు మంగళవారం నమోదయ్యాయి. మేడికుర్తిలో 
వాలంటీర్ నిర్లక్ష్యం వలన కరోనా కేసులు రోజు రోజుకు పెరిగే పరిస్థితి ఏర్పడింది. గుర్రంకొండ మండలం నడింఖండ్రిగ నుంచి తీవ్రమైన దగ్గు జలుబు తో మేడికుర్తిలోని అతని తమ్ముడైన వాలంటీర్ ఇంటికి పాజిటివ్ వ్యక్తి  రాగా మూడు రోజుల పాటు వైద్యులకు చూపించకుండా తన ఇంటిలోనే ఉంచుకోవడం,తరువాత రోజు రోజుకు పరిస్థితి తీవ్రత పెరుతుండడంతో కరోన పరీక్షల కు పంపడం, పరీక్షలు నిర్వహించిన తరువాత కూడ తన ఇంటిలోనే రెండు రోజుల పాటు ఉంచుకొని నిర్లక్ష్యం వహించడం వలన కలికిరి మండలం మేడికుర్తి గ్రామంలోని  వాలంటీర్ తల్లి,తండ్రికి,వదినకు నేడు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్లు మదనపల్లి డివిజన్ డిప్యూటీ డియంహెచ్ఒ డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు.నిర్లక్ష్యం వహించి కేసులు పెరగడానికి కారణమైన వాలంటీర్ రిజల్ట్స్ రావలసి వుందని డాక్టర్ లోకవర్ధన్ తెలిపారు.ఇదిలా వుంటే ఈ కుటుంబ ప్రైమరీ,సెకండరీ గా కాంటాక్ట్ గా వారి ఇంటికి వచ్చే ఉర్దూ చదువుకునే చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం.

Andrapradesh

Jun 23 2020, 19:45

నిమ్మగడ్డ తో రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి... ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్య భేటీకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన సూత్రధారి అని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి లు ముగ్గురు కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ రమేష్ పై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వంకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థల్లోకి సొంత మనుషులను చొప్పించడం, ఆవ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైందని మండిపడ్డారు. సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంతో చంద్రబాబు ఎక్స్‌పర్ట్‌ అని, వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు.  టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్‌ సంతకం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మాటలు విని స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Andrapradesh

Jun 23 2020, 18:28

AP: కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా?

సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. అయితే.. బోధనాసుపత్రుల నిర్మాణానికి సంబంధించి జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనను మరోమారు ప్రస్తావించారు.

రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నందున దానికి అనుగుణంగా బోధనాసుపత్రులు నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి జిల్లాలోనూ బోధనాసుపత్రి ఒకటి ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ముఖ్యమంత్రి అధికారులతో వ్యాఖ్యానించారు. వీటి నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన స్థలాలను సేకరించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మాత్రమే బోధనాసుపత్రులు ఉన్నాయని.. కొత్తగా మరో 16 నిర్మించబోతున్నట్టు సీఎం వెల్లడించారు. దీనికి అదనంగా కర్నూలు జిల్లా ఆదోనిలోనూ మరో బోధనాసుపత్రిని నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Andrapradesh

Jun 23 2020, 18:27

ఎల్జీ పాలిమర్స్‌ : హైకోర్టు కెక్కిన దక్షిణ కొరియా బృందం

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తమను ఇక్కడే ఆపేశారని దక్షిణ కొరియా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎల్జీ సంస్థకు వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావడం వల్ల విశాఖ వచ్చారని వాళ్ల తరపు న్యాయవాది వాదించారు. ఇక వివరాలు సేకరించేందుకే దక్షిణ కొరియా బృందానికి పోలీసులు నోటీసులిచ్చినట్లు ఏజీ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై భవిష్యత్తులో విచారణ కోసం అవసరమైతే మళ్లీ రావాల్సి ఉంటుందని ఏజీ తెలిపారు. వాదనలు విన్న  ధర్మాసనం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసుల అభ్యర్థన మేరకు వారు రాకపోతే హైకోర్టులో పిటిషన్‌ వేయవచ్చని సూచించి తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

Andrapradesh

Jun 23 2020, 18:25

శాసనసభ నిర్ణయాలే ఫైనల్‌: తమ్మినేని


అమరావతి: శాసనసభ అనేది ప్రజల సభ.. శాసనమండలి కేవలం సలహాలు ఇవ్వడానికి మాత్రమే అని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు నిలిచిపోయిన నేపథ్యంలో స్పీకర్‌ మాట్లాడారు. శాసనసభలో తీసుకున్న నిర్ణయాలే ఫైనల్‌ అని తమ్మినేని మరోసారి స్పష్టం చేశారు.
‘‘శాసనసభలో చర్చించి, ఆమోదించిన బిల్లులను ఎగువసభకు పంపించాం. వాటిపై సూచనలు చేసే అవసరం ఉంటే శాసనసభకు సూచించొచ్చు. కానీ ఏకంగా బిల్లును వీటో చేసే అధికారం మండలికి లేదు. ఇచ్చిన గౌరవాన్ని పెద్దల సభ నిలబెట్టుకోలేకపోతోంది. ఇప్పటికైనా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం’’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు