Centralnews

Mar 26 2020, 06:26

అప్పటి వరకు HD క్వాలిటీ లేనట్లే... - డిజిటల్‌ ఇండస్ట్రీ కీలక నిర్ణయం

దిల్లీ
By Sridhar Dasari

   కరోనా వైరస్‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు థియేటర్లు, మాల్స్‌ సైతం మూతపడ్డాయి. దీంతో ఇంటర్నెట్‌ వాడకం దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో డిజిటల్‌ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెజాన్‌ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, హాట్‌స్టార్‌, టిక్‌టాక్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి యాప్స్‌లో HD, ఆల్ట్రా HD వీడియో ప్రసారాలను తాత్కాలికంగా SDలో మాత్రమే అందించాలని ఆయా సంస్థలు నిర్ణయించుకున్నాయి. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిజిటల్‌ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఏప్రిల్‌ 14 వరకు మొబైల్‌ నెట్‌వర్క్‌లో 480pలో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతాయి. నెట్‌వర్క్‌ సమస్య ఏర్పడకుండా, వర్క్‌ఫ్రమ్‌ హోం చేసేవారికి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Centralnews

Mar 25 2020, 23:27

చైనాలో తిరగబెడుతున్న కరోనా...?

By Sridhar Dasari

   రెండు నెలల లాక్ డౌన్ తర్వాత చైనాలోని ప్రఖ్యాత వూహాన్ సిటీలో బస్సులు, కార్ల చప్పుళ్లు వనిపించాయి. బుధవారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం బస్సు సర్వీసుల్ని ప్రారంభించింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సుకు ఒకరు చొప్పున హెల్త్ సూపర్ వైజర్ ను నియమించారు. ప్రయాణికులెవరైనా అనారోగ్యానికి గురైతే సాయం అందించేందుకే ఈ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. టికెట్ తోపాటు వెల్ నెస్ వివరాల్ని కూడా మొబైల్స్ లో చూపాల్సి ఉంటుందని, ఫోన్లు లేనివాళ్లు డాక్టర్ సర్టిఫికేట్ వెంట ఉంచుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.

    గత మూడు వారాలుగా చైనాలో కరోనా ప్రభావం తగ్గుతూ రావడం, గత బుధవారం నుంచి మరణాల సంఖ్య కూడా దాదాపు పడిపోవడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. రెండు నెలల లాక్ డౌన్ తర్వాత ఇటు వూహాన్ లో బస్సు సౌకర్యాన్ని పున: ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందే దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. 
   కాగా, ఇన్నాళ్లూ ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన చైనీయులు స్వదేశానికి వెళుతూ మళ్లీ వైరస్ ను మోసుకెళుతున్నట్లు వెల్లడైంది.

కొత్త కేసులు...

   చైనాలో బుధవారం నాటికి 474 కొత్త కేసులు నమోదయ్యాయని, అయితే అందులో ఏ ఒక్కటి కూడా లోకల్ ట్రాన్స్ మిషన్ వల్ల రాలేదని, అందరికి అందరూ బయటి దేశాల నుంచి వచ్చినవాళ్లేనని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అంతర్జాతీయ సర్వీసులు మొదలు కావడంతో వివిధ దేశాల్లో ఇరుక్కు పోయిన వాళ్లంతా సొంతగడ్డకు వస్తుండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వాళ్లందరికీ అవసరరాన్ని బట్టి ఐసోలేషన్ లేదంటే క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది.

Centralnews

Mar 25 2020, 22:59

భారత్ ప్రపంచానికే మార్గం చూపింది

జెనీవా
By Sridhar Dasari

   పోలియో, మశూచి లాంటి అతిపెద్ద మహమ్మారులను జయించిన భారత్.. ప్రపంచానికే మార్గం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్‌ఓ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జె ర్యాన్ గుర్తు చేశారు. తాజాగా శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్19)ను కట్టడి చేసే శక్తి మన దేశానికి ఉందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే వైరస్ విజృంభిస్తున్న ప్రదేశాల్లో వైద్య పరీక్షా సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడిని సులభమైన పరిష్కారాలు లేవని, భారత్ లాంటి దేశాలే మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశాల్లోనే కరోనా వైరస్ కట్టడిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 16 వేల మందికి పైగా ప్రజలు కరోనా వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు.
 
మరోవైపు బాధితుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. దీంతో అన్ని దేశాలు మరింత కఢినమైన, వేగవంతమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని డబ్లుహెచ్‌ఓ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆటు భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంభించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కూడా. ప్రస్తుతానికి దేశంలో దాదాపు 450 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా మరో 34 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు.

Centralnews

Mar 25 2020, 22:49

భోపాల్‌లో పాత్రికేయుడికి కరోనా పాజిటివ్‌

భోపాల్‌
By Sridhar Dasari

  మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పాత్రికేయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ మీడియా సమావేశానికి హారయ్యాడు. మార్చి 17న లండన్‌ నుంచి వచ్చిన ఆ పాత్రికేయుడి కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తన కుమార్తెతో ఉండటం వల్ల ఈ మహమ్మారి అతడికీ సోకింది. పాత్రికేయుడి భార్య, కుమారుడికి పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయింది.

Centralnews

Mar 25 2020, 22:45

సంక్షోభంలో ఉన్న ప్రజలను కాశీయే నడిపించగలదు

దిల్లీ
By Sridhar Dasari

  కరోనాను ఓడించాలంటే ఇళ్లకు పరిమితమైతే చాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారణాసి పౌరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘ సంక్షోభంలో ఉన్న దేశ ప్రజలను కాశీయే నడిపించగలదు. దేశానికి సహనం, కరుణ, శాంతిని కాశీయే నేర్పించగలదు. కరోనా ఎంత ప్రమాదకరమైందో ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని అన్నారు.

Centralnews

Mar 25 2020, 22:41

24 గంటల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ 

దిల్లీ
By Sridhar Dasari

   దేశ రాజధానిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 5 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దిల్లీలో కరోనా సోకిన వారి సంఖ్య 35కి చేరిందన్నారు. మరోవైపు
పంజాబ్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అక్కడ కరోనా సోకిన వారిన సంఖ్య 31కి చేరింది.

Centralnews

Mar 24 2020, 21:50

కరోనా ఎఫెక్ట్‌.. విడుదల కానున్న 3000 ఖైదీలు

తీహార్
By Sridhar Dasari

   కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సుమారు 3000 ఖైదీలను విడుదల చేయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘‘సుమారు 1,500 ఖైదీలను పెరోల్‌పైన, అదే సంఖ్యలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై రానున్న మూడు, నాలుగు రోజుల్లో విడుదల చేస్తాం. కరోనా వైరస్‌ (కొవిడ్-19) నేపథ్యంలో జైళ్లలో రద్దీని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకుంటున్నాం.’’ అని జైళ్లశాఖ డైరక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ ప్రకటించారు. అయితే విడుదలయ్యే వారిలో తీవ్ర నేరాలు చేసినవారు, కరడుగట్టిన ఖైదీలు ఉండరని ఆయన వివరించారు.  
దేశవ్యాప్తంగా ఉన్న 1,339 జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి 4,66,084 మంది ఖైదీలు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖైదీలకే కాకుండా జైలు సిబ్బంది, సందర్శకులు, న్యాయవాదులకు కూడా కరోనా ముప్పు పొంచి ఉంది. జైళ్లలోని ఖైదీలకు కూడా కొవిడ్‌-19 సోకే అవకాశముందనే వాదనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం ఆదేశానుసారం... ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశమున్న ఖైదీలను విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తీహార్ జైలు అధికారులు వివరించారు. కాగా, వీరిని నాలుగు నుంచి ఆరు వారాల పాటు పెరోల్‌పై విడిచిపెట్టే అవకాశముంది.

Centralnews

Mar 24 2020, 21:13

కరోనా మృతి: అంత్యక్రియలకు నిరాకరణ!

కోల్‌కతా
By Sridhar Dasari

   కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్న హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల సంఖ్య పదికి చేరింది. ఈ సమయంలో ఈ వైరస్‌తో మృతిచెందిని వారికి అంత్యక్రియలు నిర్వహించడం సవాల్‌గా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి ఎటువంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు. అయినప్పటికీ కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 19న ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నాలుగురోజుల చికిత్స అనంతరం సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతోపాటు జిల్లా అధికారులకు తెలియజేశారు. 
    ఈ వార్త వినగానే ఆ వ్యక్తి నివసించే ఉత్తర 24పరగణాల జిల్లాలోని డమ్‌డమ్‌ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే కుటుంబసభ్యులను ప్రత్యేక పరిశీలనలో ఉంచగా..ఆసుపత్రి నుంచి మృతిదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ముందుకు రాలేదు. వైరస్‌ తమకు సోకుతుందనే భయంతో ఆసుపత్రికి రావడానికి కూడా నిరాకరించారు. ఈ సమయంలో మృతిచెందిన వ్యక్తి భార్య, కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నందున వారు కూడా అంత్యక్రియలకు దూరమయ్యారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి అధికారులకు సూచించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక వ్యక్తి సంతకం సరిపోతుంది. ఇందుకోసం ఐసోలేషన్‌లో ఉన్న అతని భార్యకు విషయం తెలియజేసిన అధికారులు ఆమె సంతకాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో స్థానిక స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు కూడా నిరాకరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కరోనా సోకిన వ్యక్తికి చికిత్స చేసిన ఏఎంఆర్‌ఐ ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిని హోం క్వారంటైన్‌ కావాలని అధికారులు సూచించారు.

Centralnews

Mar 24 2020, 21:04

చేతులు జోడించి వేడుకుంటున్నా.. గడపదాటొద్దు: మోదీ

దిల్లీ
By Sridhar Dasari

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకే ఆలోచిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ మొదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే 3లక్షలకు చేరింది. అమెరికా, ఇటలీలో అత్యుత్తమ వైద్య సేవలున్నా కరోనా నియంత్రణలో లేదు.  దేశంలో ఏం జరిగినా ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రధాని నుంచి గ్రామ వాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. ఏం జరిగినా ఇంటి చుట్టూ ఉన్న లక్ష్మణ రేఖ దాటి బయటకు రావొద్దు. కరోనాపై పోరాటానికి మన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయమిది. ప్రతిఒక్కరూ క్రమశిక్షణ, సంయమనం పాటించాలి. ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నా’’ 
‘‘24 గంటలూ పనిచేస్తున్న పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దాం. ప్రయివేటు సంస్థలు కూడా ప్రభుత్వానికి  తోడ్పాటునిస్తున్నాయి. ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మవద్దు. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.

Centralnews

Mar 24 2020, 20:27

అలా చేస్తే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కలేం: మోదీ

దిల్లీ
By Sridhar Dasari

 మార్చి 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచింది. కరోనా ఎలా వ్యాప్తి చెందుతుందో వార్తల్లో చూస్తున్నాం.  ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి. ఒకరికి ఒకరు దూరంగా ఉంటూ ఇళ్లల్లోనే ఉండాలి. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టేక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి’’ అని మోదీ అన్నారు. 
 

ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌
 
    కరోనా మహమ్మారి కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం. కానీ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇది తప్పనిసరి. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి వీధి లాక్‌డౌన్‌. దీన్ని ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ ఒక్క పౌరుడూ గడప దాటి బయటకు రావొద్దు. జనతాకర్ఫ్యూకు మించి లాక్‌డౌన్‌ అమలు చేస్తాం’’ అని అన్నారు.

 • Centralnews
   @Centralnews ఈ 21 రోజులు బయటకు వెళ్లాలనే ఆలోచనే మానుకోండి 
  
    కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న 21 రోజులు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారన్నారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ 21 రోజులు జాగ్రత్తగా ఉందాం.. దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.