బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం
•బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
•రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు 3.4 శాతం నిధులా ఇదెక్కడి న్యాయం..?
•అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా..?
•-- బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం 3,04,965 లక్షల కోట్ల బడ్జెట్లో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 11,405 కోట్లు, 3.4 శాతం నిధులు కేటాయించి బీసీల గొంతుకోసి తీరని అన్యాయం చేశారన్నారు. గత సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో బీసీల లెక్కలు లేవనే సాకుతో కేవలం 9,200 కోట్లు కేటాయించిందని కానీ ప్రస్తుతం స్పష్టమైన లెక్క ప్రభుత్వం తేల్చిన తర్వాత కూడా కొత్త సీసాలో పాత చింతకాయ పచ్చడి అన్న చందంగా ప్రస్తుత బడ్జెట్ ఉందని ఎద్దేవాచేశారు.
ప్రభుత్వం మారితే బీసీల బ్రతుకులు మారుతాయని ఆశించినా ఫలితం శూన్యంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్తో బీసీలకు ఒరిగిందేమీ లేదని 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 3.4 శాతం నిధులు బడ్జెట్లో కేటాయిస్తే ఏవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర సంపద సృష్టించేది, ఉత్పత్తి చేసేది బీసీలని, సగానికిపైగా పన్నులు కట్టేది బీసీలన్నారు. అప్పులేమో బీసీలకు సంపదేమో అగ్రవర్ణాలకా అని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ నిధులు రెండున్నర కోట్ల బీసీ జనాభాకు పంచితే చాక్లెట్లు బిస్కెట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
ఇప్పటికే గ్లోబరైజేషన్ లిబరైజేషన్ మార్పుల తర్వాత పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరగడంతో పెద్ద పరిశ్రమలు కంపెనీలు రావడంతో చేతివృత్తులు కులవృత్తులు దెబ్బతిన్న కారణంగా బీసీల బ్రతుకులు రోడ్ల పాలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని 40 వేల కోట్లు కేటాయించి బీసీలపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. అంతేకాకుండా 50 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి అమలుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, బీసీ యువజన సంఘం నాయకులు శేరి రవీందర్, జక్కలి సాయి కంబాలపల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mar 20 2025, 13:13