మెదక్ చర్చితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం రేవంత్
వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.
క్రిస్మస్ పర్వదాన్ని పురస్కరించుకుని మెదక్ సీఎస్‌ఐ చర్చ్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఏసు భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి వస్తానని ఆనాడు మాట ఇచ్చానని గుర్తుచేసుకున్నారు.
శతాబ్ది ఉత్సవాలు, భక్తులతో క్రిస్మస్ జరుపుకోవాలనే ఇక్కడకు వచ్చానని తెలిపారు. తమది పేదల ప్రభుత్వమని.. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో దళితులు, గిరిజనులకు మేలు జరుగుతోందన్నారు. మెదక్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు పొంగులేటి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు.
మెదక్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు వన దుర్గాదేవిని దర్శించుకున్నారు.
ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మెదక్ చేరుకున్న సీఎం రేవంత్.. అక్కడ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మెదక్ చర్చికి చేరుకున్నారు. అక్కడ చర్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆపై అక్కడ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
Dec 25 2024, 18:02