తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టింది ఆయనే
తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపీ పెట్టిన అంశం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఈ ఘటనతో అన్య మత ప్రచారం జరుగుతుందని, కావాలని ఎవరో ఈ పనికి ఒడిగట్టారని హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాయల చెరువు రోడ్డు కూడలిలో అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ పెట్టిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటన పైన హిందూ సంఘాలు, స్వామీజీలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగి తిరుమల శ్రీవారి పరమ భక్తుడైన అన్నమయ్య విగ్రహానికి ఇలా శాంటా క్లాస్ టోపీ పెట్టి అపచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇక దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు అక్కడ ఏం జరిగింది అన్నది సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించారు.
ఇక సీసీటీవీ ఫుటేజ్ లో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాజ్ టోపీ ఒక వ్యక్తి పెట్టినట్టుగా గుర్తించారు. ఆ వ్యక్తి కూడళ్లలో పెన్నులు విక్రయిస్తూ ఉంటాడని గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అయితే అతడు తెలిసీ తెలియక శాంటా క్లాజ్ టోపీ అన్నమయ్యకు పెట్టాడా లేక శాంటా క్లాజ్ టోపీ పెట్టడానికి ఎవరైనా అతనిని ప్రోత్సహించారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఇదే సమయంలో సంయమనం పాటించాలని కూడా పోలీసులు సూచించారు.
అయితే ఆ వ్యక్తి తెలియకుండా చేశాడా? ఆకతాయితనంగా చేశాడా? లేక మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా చెబితే చేశాడా? అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. క్రైస్తవుల పండుగ అయిన క్రిస్మస్ పండుగకు ముందు రోజు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో మత విద్వేషాలు రగలకుండా తిరుపతిలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా అసలు ఏం జరిగింది అనేది వెలుగులోకి వచ్చింది.
Dec 25 2024, 16:24