ఏపీ నుంచి అయోధ్యకు వందేభారత్ స్లీపర్ - రూట్ షెడ్యూల్
ఏపీ నుంచి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది. మరి కొద్ది రోజుల్లోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ రైళ్ల కోసం భారీగా డిమాండ్ ఉంది. ఇక, ఏపీ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎంపీలు రైల్వే శాఖకు ప్రతిపాదించారు. వీటి పైన అధ్యయనం కొనసాగుతుండగానే.. తాజాగా ఏపీ నుంచి అయోధ్యకు వందేభారత్ స్లీపర్ కేటాయించాలనే ఏపీ ముఖ్యుల సూచన మేరకు రైల్వే శాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కసరత్తు కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. విశాఖ - సికింద్రాబాద్, కాచిగూడ - యశ్వంత్ పూర్, విజయవాడ - చెన్నై, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ నుంచి దూరపు ప్రాంతా లకు చేరుకునేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వితని పత్రాలు సమర్పించారు.
విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ ఏర్పాటు పైన అధ్యయనం కొనసాగుతోంది. విజయవాడ నుంచి చెన్నైకు ప్రస్తుతం వందేభారత్ కొనసాగుతోంది. బెంగళూరుకు ఏర్పాటు చేయటం ద్వారా ప్రయోజన కరంగా ఉంటుందనే వినతులు రైల్వే బోర్డుకు చేరాయి. అయితే, వందే భారత్ స్లీపర్ కోసం దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కేటాయింపు లు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. కానీ, ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధులు కోరారు. దీని ద్వారా ఏపీ నుంచి రెగ్యులర్ రైళ్లల్లో అయోధ్య, వారణాసి వెళ్లే వారికి ప్రయోజన కరంగా ఉంటుందని వివరించారు.
ఈ ప్రతిపాదనకు ప్రయార్టీ ఇస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో, వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్లాలెక్కిన తరువాత విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి కి కేటాయింపు పైన తొలి రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని కూటమి ముఖ్య నేతలు చెబుతున్నారు. ఇక, వచ్చే నెలలో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లను సైతం ప్రకటిస్తున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగానే భావించాలి.
Dec 25 2024, 15:19