భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్ప వద్దు: కోటం రాజు
నల్లగొండ: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని,బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకుఅమలు చేయాలని, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద బీమా, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం తదితర సంక్షేమ పథకాలను భీమా కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పజెప్పాలని ఆలోచన చేస్తుందని, అన్ని యూనియన్లు కొద్దిగా వెనకకు తగ్గిన పూర్తిగా విరమించుకోకపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
వెల్ఫేర్ బోర్డు సైట్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా క్లెయిమ్స్ పరిష్కారం కాకుండా ఉండిపోయాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని, భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డు నే నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెల్ఫేర్ బోర్డులో 5500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని, వాటిని కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్నా పాటించడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ,బి దయానంద్, వరికుప్పల ముత్యాలు, అవుట రవీందర్, బి సైదులు,బివెంకటయ్య యాదయ్య, మన్నెం శంకర్, ఎం.రామకృష్ణ, శంకర్, ఎండి సర్దార్, ఎస్.కె హుస్సేన్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
Dec 13 2024, 21:59