హమాస్‌కు ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే తన వైఖరిని ప్రదర్శించడం మొదలుపెట్టారు. పాలస్తీనా గ్రూప్ హమాస్‌ను ట్రంప్ నేరుగా బెదిరించారు.
తాను అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టే లేపు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే, మధ్యప్రాచ్యంలో విధ్వంసం తెస్తానని వార్నింగ్ ఇచ్చారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదంపై ట్రంప్ మాట్లాడుతూ.. జనవరి 20, 2025లోపు బందీలను విడుదల చేయకపోతే మధ్యప్రాచ్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. కాగా 2025 జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మానవత్వంపై అకృత్యాలకు పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ట్రూత్‌లో అన్నారు. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ బందీలుగా పట్టుకోవడం హింసాత్మకం, అమానవీయమని ట్రంప్ అభివర్ణించారు.
అత్యంత హింసాత్మకంగా, అమానవీయంగా, యావత్ ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్న బందీల గురించి అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయంపై గతంలో జరిగిన చర్చలను ట్రంప్ విమర్శించారు, బందీల గురించి చాలా చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
విదేశీ సంస్థలపై గతంలో అమెరికా తీసుకున్న చర్యల కంటే బందీలుగా ఉన్నవారికి బాధ్యులైన వారిపై పెద్ద ఎత్తున విచారణ జరిపిస్తామని ట్రంప్ చెప్పారు.
బందీలను ఇప్పుడే విడుదల చేయండంటూ బెదిరించారు. లేదంటే హమాస్ ఊహించని రీతిలో దాడులు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాధ్యులపై దాడులు జరుగుతాయని ట్రంప్ అన్నారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ పెద్ద దాడి చేసింది. 1,200 మందికి పైగా మరణించారు. 250 మందికి పైగా బందీలుగా ఉన్నారు. వీరిలో దాదాపు 100 మంది ఇప్పటికీ చెరలో ఉన్నారు. ఇజ్రాయెల్ గాజాలోని హమాస్ స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడిని ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడులు గాజాలో 45,000 మందికి పైగా పాలస్తీనియన్లను చంపాయి.
Dec 03 2024, 13:56