బ్యాడ్ న్యూస్ చెప్పిన రామ్ గోపాల్ వర్మ
తాను పరారీలో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, తన కార్యాలయం ఆర్జీవీ డెన్లోనే ఉంటోన్నానని వెల్లడించారు. తనను అరెస్ట్ చేయడానికి ఏ పోలీసూ రాలేదని తేల్చి చెప్పారు. దీనిపై నా కేసు- ఆర్జీవీ అంటూ ఓ సుదీర్ఘ ట్వీట్ పోస్ట్ చేశారు.
అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి పరారీలో ఉన్నానని, మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు తన కోసం వెతుకుతున్నరని ఆనందపదుతున్న వాళ్లందరికీ ఓ బ్యాడ్ న్యూస్ అంటూ ట్వీట్‌ను మొదలు పెట్టారు ఆర్జీవీ. భారత న్యాయసంహిత కింద ఎలాంటి కేసులు నమోదయ్యాయో.. అందులో ఏవి తనకు వర్తిస్తాయో, వర్తించవో కూడా వివరించారు.
ఇంత వరకు పోలీసులు తన ఆఫీసు లోకి కాలే పెట్టలేదని, పైగా అరెస్టు చేయడానికి వచ్చినట్లు తన మనుషులతో గానీ మీడియాతో గానీ చెప్పలేదని, తనను అరెస్టు చేయడానికే వస్తే ఆఫీసులోకి ఎందుకు రారు అని ప్రశ్నించారు. ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టాను అని అంటున్న కొన్ని మీమ్స్ వల్ల కేసు పెట్టారని, ఇప్పుడు సడెన్‌గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినటం వల్ల కంప్లైంట్ ఇచ్చారట అని గుర్తుచేశారు.
నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఏపీలోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో తన మీద ఈ కేసు పెట్టారని, మీడియా చెబుతున్న దాని ప్రకారం మరో అయిదు కేసులు కూడా నమోదు అయ్యాయని, మొత్తంగా తొమ్మిది కేసులు ఈ నాలుగైదు రోజుల్లోనే నమోదయ్యాయిని ఆర్జీవీ వివరించారు.
పోలీసుల నుంచి నోటీసు అందిన వెంటనే, సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరానని ఆర్జీవీ చెప్పారు. ఆయన కూడా దీనికి అనుమతి ఇచ్చారని వివరించారు. సినిమా పనులు పూర్తి కాకపోవడం వల్ల ఇంకొంత గడువు అడిగానని చెప్పారు. దీనికి అంగీకరించకపోతే వీడియో ద్వారా విచారణకు హాజరవుతాననీ తెలియజేశానని అన్నారు.
అదే సమయంలో తనపై వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనక ఏదో కుట్ర ఉందని తనకు, తన తోటి వారికి అనుమానం కలిగిందని రామ్ గోపాల్ వర్మ అన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటానని, రోజుకు 10 నుంచి 15 పోస్టులు పెడుతుంటానని చెప్పుకొచ్చారు.
ఒక రాజకీయ వ్యంగ్య చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదల కావడం కూడా జరిగిపోయి చాలా నెలలు అయిందని ఆర్జీవీ గుర్తుచేశారు. నేను పెట్టాను అంటున్న ఆ పోస్టుల వల్ల తమ మనోభావాలు ఎలా దెబ్బ తిన్నాయని వేర్వేరు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ఎలా అంటున్నారో వాటిని వివరించారు.
ఈ మీమ్స్ వల్ల తనపై బీఎన్ఎస్ కింద 336 (4), 353 (2), 356 (2), 61 (2), 196, 352, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదయ్యాయని ఆర్జీవీ తెలిపారు. ఏవైనా డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ రికార్డులు, ఇతరులను మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించితే సెక్షన్ 336 (4) వర్తిస్తుందని, తాను చేసిన పోస్టులను చూస్తే, అందులో ఫోర్జరీ ఎక్కడుందని ప్రశ్నించారు.
అది కేవలం ఒక కార్టూన్, ఒకవేళ దీని వల్ల ఒకరి పరువుకు భంగం కలిగింది అంటే మరి కొన్ని లక్షల మంది ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటని అన్నారు. తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను ప్రోత్సహించడం, మతం, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు/కులాలు/వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని పెంచడంపై బీఎన్ఎస్ 353 (2) సెక్షన్ కింద- కేసు నమోదు చేస్తారని, ఇది ఎలా వర్తిస్తుందో అర్థం కావట్లేదని అన్నారు.
Nov 29 2024, 11:42