BRS లో మొదలైన CM అభ్యర్థిపై చర్చ...
గత కొద్ది రోజులుగా కేటీఆర్ తెలంగాణ భవన్లో వచ్చిన ప్రతిసారి అక్కడున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కేటీఆర్ సీఎం, సీఎం.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 9 ఏళ్లపాటు పార్టీ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఆయనే అధ్యక్షుడు.. చాలా మీడియా సమావేశంలో కూడా తానే తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారం కోల్పోయి ప్రతిపక్ష పార్టీగా ఉంది బీఆర్ఎస్.. ఈ కీలక సమయంలో కేటీఆర్ సీఎం అంటూ వినిపిస్తున్న నినాదాలు దేనికి సంకేతం అని పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కేటీఆర్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించనున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ కాక మరో నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ కానీ, ప్రజలు కాని సమ్మతించే అవకాశం ఉందా.. ఇలా రకరకాలుగా పార్టీ నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక దీంతోపాటు పార్టీలో మరో కీలక నేతగా ఉన్న హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేసులో ఉంటారని గుసగుసలు నడుస్తున్నాయి. పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడ్డ హరీష్ రావును కూడా కూడా కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారనేది హరీష్ అనుచరులు ఆశిస్తున్నారు. పార్టీలో ఏ విషయమైనా స్వయంగా కేసీఆర్ మాత్రమే ప్రకటిస్తారు. అలాంటిది ఇప్పటివరకు ఈ విషయంపై ఆయన స్పందించలేదు.
అయితే ఈ కొత్తగా వినిపిస్తున్న నినాదాలు కేవలం వచ్చిన యువ కార్యకర్తల అభిమానం మాత్రమేనని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ తప్పుకుంటే.. జాతీయ రాజకీయాలపై ఆయన దృష్టి సారిస్తారా? లేక పూర్తిగా రాజకీయాలనుంచి రిటైర్ అయిపోతారా? అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి. గత ఏడాదికాలంగా కేసీఆర్ పూర్తిగా సైలెంట్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో తప్పా ఎక్కడ కనిపించలేదు. పార్టీ యాక్టివిటీస్ అన్ని ఫామ్ హౌస్ నుంచే చూస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన సమావేశాలు ఉన్న ఫామ్ హౌస్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే కేసిఆర్ త్వరలోనే ప్రజల్లోకి వస్తారని.. ప్రభుత్వాన్ని నిలదీసి ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని బీఆర్‌ఎస్ పార్టీ చెబుతుంది.
Oct 25 2024, 16:20