భువనగిరి :బాలసదనం సంఘటన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి
అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో బాలిక పై జరిగిన లైంగిక దాడి పై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే కు బాలల హక్కుల పరిరక్షణ వేదిక, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏ ఐ ఎస్ ఎఫ్ ల ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల తర్వాత బాలసదనం లోనికి మగవారికి ప్రవేశం లేకున్నా, సాయంత్రం 7 గంటలకు అవగాహన సదస్సు ఎలా ఏర్పాటు చేసారని ఆయన ప్రశ్నించారు. అదే రోజు రాత్రి 8 గంటలకు అమ్మాయి, తనపై జరిగిన లైంగిక దాడి గురించి చెప్పగా, బాలసదనం సూపరింటెండెంట్ లలిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ అసిస్టెంట్ కు చెప్పగా, విషయాన్ని దాటవేస్తూ, అటెండర్ వెంకట్ రెడ్డి మంచివాడని, అమ్మాయి అబద్దం చెబుతుందని మభ్యపెట్టి వెళ్ళినట్టు సూపరింటెండెంట్ లలిత తెలిపారని వెంకటేష్ అన్నారు. ఆ తర్వాత విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ కు, డీసీపీఓ కు సమాచారం ఇచ్చినట్టు ఆమె తెలిపారని వెంకటేష్ అన్నారు. అదే రోజు సంఘటనపై పోలీసులకు పిర్యాదు చేయాల్సిన అధికారులు విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారో అర్థం కావడం లేదన్నారు. బాలికకు జరిగిన అన్యాయాన్ని దాచిపెట్టి అమ్మయిని ఉద్దేశపూర్వకంగా వేరే ప్రాంతానికి తరలించడం వల్ల, బాలల హక్కులకు భంగం కలిగించినందుకు బాలసదనం సూపరింటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, మరియు డిసిపీఓ లపై ఫోక్సో చట్టం సెక్షన్ 19, 20 ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అటెండర్ వెంకట్ రెడ్డి పై ఫోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికను ప్రభుత్వపరంగా ఆదుకోవాలి ఆయన కోరారు. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్, నాయకులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Oct 25 2024, 15:15