NLG: జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధం: సిపిఎం
నల్లగొండ జిల్లా:
జమిలి ఎన్నికల విధానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైనది కాదు అని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల మహాసభ సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షత నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో ప్రవేశ పెట్టడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.
దేశంలో ప్రతిపక్ష పార్టీలు జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదని చెప్తూ వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. గత ఏడాది పది రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగాయని, వీటికి2028 మళ్లీ ఎన్నికలు జరగవలసి వస్తుందని అన్నారు.
అప్పుడే ఏర్పడిన ప్రభుత్వాలు ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ సమయం మాత్రమే అధికారంలో ఉంటాయన్నారు. హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని మార్చుకొని మెజార్టీ ప్రజల, రాజకీయ పార్టీల నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్న నేటికీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తామని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామన్న వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యల కోసం పనిచేసిన పోరాటాలను సమీక్షించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వహించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
డిండి ఎత్తిపోతల పథకం డి పి ఆర్ ను ఆమోదించి వెంటనే పనులు పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, చిట్టి మల్ల లింగయ్య, వెంకటేశం, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, బల్లెం స్వామి ఈరటి వెంకన్న, లింగస్వామి, సైదులు, స్వామి, లక్ష్మమ్మ, లింగమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Sep 26 2024, 11:28