బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణ లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 27 వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి,నిర్మల్ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
తెలంగాణ లోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈనెల 26, 27 తేదీల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27 వరకు వాతావరణశాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
అలాగే, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 8.53, నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో 8.35, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో 7.8, రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం తాటివనంలో 7.78, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.95, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో 7.2 నిర్మల్ జిల్లా భైంసాలో 7.4 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. వరద నీరు ముంచెత్తడంతో మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై, ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో మంఖాల్, హర్షగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Sep 25 2024, 12:24