రైలు విస్తరణ- ఈ రూట్‌లోమెట్రో
హైదరాబాద్‌లో మెట్రో రైలు మార్గాల విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టి సారించింది. జంటనగరాలు శరవేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అనుగుణంగా మెట్రో రైలు సర్వీసులను కూడా ఆయా ప్రాంతాలకు చేరువ చేయడానికి చర్యలు చేపట్టింది.
కొత్తగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి డీపీఆర్ సిద్ధం చేయాలని, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుందని అన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, హైడ్రా కార్యకలాపాలపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలను జారీ చేశారు.
హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో రైలు మార్గాల విస్తరణకు సంబంధించిన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విస్తరణకు సంబంధించి పనుల్లో జాప్యం ఉండకూడదని అన్నారు. అడ్డంకులు ఉంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టేషన్-చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ అలైన్‌మెంట్ రూపొందించాలంటూ గతంలో రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి లేదా, చాంద్రాయణగుట్ట, బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్ మార్గంలో మెట్రో రైలును నడిపించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ అప్పట్లో ఆదేశించారు.
ఈ రెండింట్లో ఏ రూట్‌లో ఖర్చు తక్కువ అవుతుందో.. దాన్నే ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల అటు పాతబస్తీ ప్రజలకూ మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. దీనికి పొడిగింపుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన నిర్ణయించారు.
Sep 25 2024, 11:30