TG: చెరువులు, కుంటలు, నాళాల పై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి: బిఎస్పి
ఖమ్మం పట్టణంలో చెరువులు, కుంటలు, నాళాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్ర ఉపేంద్ర సాహు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మం పట్టణం, అంబేద్కర్ చౌరస్తాలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, బుధవారం జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో ఉపేంద్ర సాహు మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలైన లకారం చెరువు, దంసలాపురం చెరువు, ఖానాపురం చెరువు, కుంటలు, నాళాలు, అలుగులపై అక్రమంగా భూ కబ్జాదారులు యదేచ్ఛగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు.
చెరువులతోపాటు పట్టణంలోని నాళాలపై కూడా అక్రమ నిర్మాణాలు చేయడం వల్ల తీవ్రమైన వర్షాలు కురిసినప్పుడు పట్టణంలో నీళ్లు బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు.
మున్నేరు వరదలతో దానవాయి గూడెం కాలనీ, కరుణగిరి, సాయి కృష్ణ నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కల గడ్డ, మోతి నగర్ కాలనీలు, బస్తీలలోకి వరద రావడంతో ఆ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, ఇండ్లు ఖాళీ చేశారని అన్నారు. వరదలలో ఇండ్లతో పాటు సమస్తం కోల్పోయి, కట్టుబట్టలతో రోడ్డునపడితే ముఖ్యమంత్రి పర్యటించి కంటితుడుపు చర్యగా కేవలం 16,500/- ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు.వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలు మొత్తం పేద ప్రజలే కాబట్టి కుటుంబానికి 2 లక్షల రూపాయల నష్ట పరిహారంతో పాటు ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైరా రోడ్ మొత్తం చెరువుని తలపించేలా నీటితో నిండిందన్నారు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు హైదరాబాద్ లో హైడ్రా తరహాలో ఖమ్మం లో చెరువులు, కుంటలు, నాలాలపై ఉన్న ఆక్రమణ లని తొలగించి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను తొలగించేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఎంతటి పోరాటాలకైనా సిద్దపడుతుందని పేర్కొన్నారు.
నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ కు మెమోరాండం అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ ఎం. పుల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెపోగు విజయ్, జిల్లా కార్యదర్శులు బి. ఉపేందర్, దారెల్లి రమేష్, ఆదూరి కోటయ్య, మహిళా నాయకురాలు కుమారి, యూ. నవీన్, డి. రాజశేఖర్, ఆర్. రమేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Sep 19 2024, 21:49