బీసీ కులగణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి
గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.
తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు. సోమవారం గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో తక్షణమే కులగణన జరిగే విధంగా ఆశీర్వదించాలని వేడుకున్నారు. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ సమగ్ర కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి గత 8 నెలలుగా రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ కులగణన పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
కులగణనపై అఖిలపక్ష పార్టీలు, వివిధ ప్రజా స్వామిక సంఘాలు, ఉద్యమ సంఘాలు ముక్తకంఠంతో కులగణనను చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబించడం చాలా దారుణమన్నారు. బీసీ కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్లను తగ్గించి బీసీల వ్యతిరేకతతో కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశాడని కెసిఆర్ బాటలోనే మేము కూడా నడుస్తామని కాంగ్రెస్ అనుకుంటే బీసీల అగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.
బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని లేకుంటే వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణనన నిర్వహించి బీసీలకు జనాభా ప్రకారం వాటా దక్కాలని మాట్లాడుతుంటే ఆయన బొమ్మతో గెలిచిన ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై మీన మేషాలు లెక్కబెడుతుందన్నారు. రాష్ట్రంలో కులగణనను చేయకుండా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రతిష్టకు బంగం కలిగే విధంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.
ఈ పూజా కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యలిజాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు విశ్వనాధుల శివకుమార్, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యువజన సంఘం నాయకులు కోట రమణ, వీరమల్ల ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Sep 10 2024, 13:43