NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిల్వర్ జూబ్లీ వేడుక
నల్గొండ పట్టణంలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సిల్వర్ జూబ్లీ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావ్య ,డాక్టర్ విశ్వజ్యోతి మాట్లాడుతూ.. ఇద్దరు ముగ్గురు సిబ్బందితో ప్రారంభమైన లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. అంచలంచెలుగా ఎదిగి నేడు హౌస్ సర్జన్లు సైతం విచ్చేసి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగిందని అన్నారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గర్భిణీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వ్యాక్సిన్లు ఇవ్వడం జరుగుతుందని, అనంతరం వారిని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవాలు చేయించడం జరుగుతుందని తెలిపారు.
దీంతోపాటు సాధారణ టీకాల కార్యక్రమాలు, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తోపాటు సాధారణ వైద్య సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇవే కాకుండా ప్రభుత్వం చేపట్టే అన్ని రకాల వైద్య ఆరోగ్య కార్యక్రమాలను పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు,మెడికల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు.
డెంగ్యూ, చికున్ గున్యా వంటి వైరల్ ఫీవర్ లపై సర్వే నిర్వహించి, జ్వర పీడితులను గుర్తించి, చికిత్సలు అందజేస్తున్నామని, అవసరమైతే వారిని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు పంపిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రతిరోజు 20 మంది మాత్రమే ఓపి సేవలు పొందే వారిని, ప్రస్తుతం ప్రతిరోజు 150 మంది ఓపి సేవలు పొందుతున్నారని తెలిపారు. అన్ని రకాల మందులు సైతం అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహిని, డాక్టర్ మసీన, డాక్టర్ విజయ్ కుమార్, ఏఎన్ఎం సువార్తమ్మ, రేణుక , భాగ్యలక్ష్మి, నలిని, నాగమణి,వినోద, సిబ్బంది జానీ, శ్రీనివాస్,అంబేద్కర్, కళమ్మ, పద్మ, భాగ్యలక్ష్మి, రాజకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సరిత, నాగేందర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Aug 29 2024, 21:07