ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్ భూతం..
Plastic: ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్ భూతం
దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్
సైజు 0.1 మి.మీ. నుంచి 5 మి.మీ.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
‘టాక్సిక్స్ లింక్’ అధ్యయనంలో వెల్లడి
దిల్లీ: దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్స్ (ప్లాస్టిక్ రేణువులు) ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండూ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు.. అన్ బ్రాండెడ్ ఉప్పు, చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ‘పెద్ద బ్రాండ్.. చిన్న బ్రాండ్ అనే కాదు. అన్ బ్రాండెడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్యాకేజ్డ్, అన్ ప్యాకేజ్డ్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉనికి ఉంది’ అని ‘టాక్సిక్స్ లింక్’ అనే పర్యావరణ పరిశోధన సంస్థ ‘మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకుని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులున్నాయి.
ఉప్పు, చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి.
ఈ మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకూ ఉన్నాయి.
అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, ఫిల్మ్స్ రూపంలో కనిపించాయి.
భారతీయుల్లో వినియోగం అధికం
భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రో ప్లాస్టిక్స్ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలిద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతోపాటు తల్లి పాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది.
నిర్దిష్ట చర్యల కోసమే: టాక్సిక్స్ లింక్
మైక్రో ప్లాస్టిక్స్‌పై శాస్త్రీయ డేటాబేస్‌కు మరింత సమాచారం జోడించడానికే తాము అధ్యయనం చేశామని టాక్సిక్స్ లింక్ ఫౌండర్-డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు. దీనిద్వారా అంతర్జాతీయంగా మైక్రో ప్లాస్టిక్స్‌పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ‘ఉప్పు, చక్కెరల్లో అధిక మైక్రో ప్లాస్టిక్స్ ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇది ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అత్యవసరంగా, సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది’ అని టాక్సిక్స్ లింక్ అసోసియేట్ డైరెక్టర్ సతీశ్ సిన్హా పేర్కొన్నారు.
కేజీ ఉప్పులో 89.15 వరకూ..
ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
• ఇళ్లలో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో (89.15) ఉండటం గమనార్హం.
ఆర్గానిక్ రాక్ సాల్ట్‌లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి.
చక్కెరలో 68.25 వరకూ..
కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది.
ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
Aug 20 2024, 09:05