ఆర్టీసీ కార్గోలో రాఖీలు..!
- 24 గంటల్లో చేరేలా చర్యలు
ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా పంపే అవకాశం కల్పించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని పేర్కొన్నారు.
ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్గో అధికారులు కౌంటర్లు తెరవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాకపోవడంతో ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి ఉన్నారు. రాఖీల రవాణకు సంబంధించిన ధరల విషయంలో సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Aug 11 2024, 08:06