నెరవేరనున్న విమానం కల
దొనకొండలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల భోగాపురం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సమక్షంలో అధికారులు దొనకొండ విమానాశ్రయం గురించి వివరించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
దొనకొండలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇటీవల భోగాపురం విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సమక్షంలో అధికారులు దొనకొండ విమానాశ్రయం గురించి వివరించటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీని అభివృద్ధికి వెయ్యి ఎకరాల భూమి కేటాయిస్తామని ఎయిర్‌పోర్ట్ అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టర్ ఆదేశాల మేరకు కనిగిరి ఆర్డీవో జాన్‌ఇర్విన్ మంగళవారం దొనకొండ విమానాశ్రయం భవనం, అందుకు సంబంధించిన భూములను పరిశీలించారు
పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలంటూ రెవెన్యూ సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అందరి దృష్టి దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపైనే పడింది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్దిరోజులకే దీని అభివృద్ధికి కదలికలు ప్రారంభమవడం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు.
1934లో బ్రిటీష్ పాలకులు మద్రాస్, హైదరాబాద్‌కు మధ్యలో ఉన్న దొనకొండను గుర్తించి 136.50 ఎకరాల విస్తీర్ణంలో టెర్మినల్, నిర్వహణ భవనాలతో విమానాశ్రయాన్ని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విమానాల్లో ఇంధనం నింపుకునేందుకు, ఆయుధాల తరలింపునకు బ్రిటీష్ వారు దీనిని ఉపయోగించుకున్నట్లు సమాచారం. 1960 తర్వాత దొనకొండకు విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో అప్పటినుంచి నిరుపయోగంగా మారింది. ఎయిర్‌పోర్టు అథారిటీ వారు దాదాపు పదేళ్ల క్రితం రూ.40 లక్షల వ్యయంతో చుట్టూ ఐరన్ ఫెన్షింగ్ ఏర్పాటు చేయడం, నేటికీ ఇన్‌చార్జిగా ఒక ఉద్యోగి ఇక్కడ విధులు నిర్వహిస్తుండటం గమనార్హం.
2014లో అధికారం చేపట్టిన అనంతరం దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కారిడార్‌కు అనుసంధానంగా విమానాశ్రయం ఏర్పాటు నిమిత్తం అప్పటి భోగాపురం ఎయిర్‌పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు దొనకొండ విమానాశ్రయాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఇక్కడ 15 సీట్ల మినీ విమానాలు రన్‌వేపై దిగడానికి సౌకర్యవంతమని ప్రభుత్వానికి నివేదించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రాంతీయ అనుసంధాల పథకాలకు దొనకొండలోని విమానాశ్రయం ఎంపికైంది. అప్పటి గన్నవరం ఎయిర్‌పోర్టు అథారిటీ సహాయ మేనేజర్ సురేష్ బృందం విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించింది. ఉన్న 136 ఎకరాలతోపాటు మరో 340 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు.
రెవెన్యూ అధికారులు నరసింహనాయునిపాలెం, ఇండ్లచెరువు రెవెన్యూ పరిధిలోని 340 ఎకరాల భూములను అప్పట్లో ఎంపిక చేశారు. మొత్తం 1,575 మీటర్ల పొడవున రన్‌వే ఏర్పాటుకు ప్రాథమిక సర్వే చేపట్టారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు అనంతరం ఈప్రాంత డిమాండ్‌ను బట్టి ప్రయాణికుల విమానాల రాకపోకలు జరుగుతాయని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు సర్వే విభాగం అసిస్టెంట్ మేనేజర్ అరివోలి బృందం దొనకొండలో ఉన్న 136 ఎకరాలు, అదనంగా గుర్తించిన 340 ఎకరాల్లో విమానం సేఫ్ ల్యాండింగ్ నిమిత్తం రన్‌వే ఏర్పాటుకు స్థానిక సిబ్బందితో కలిసి వారంరోజులు సర్వే నిర్వహించారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని అప్పట్లో వారు ప్రకటించారు
దొనకొండలో విమానాశ్రయ అభివృద్ధికి పలు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టింది. దీంతో ఈ అంశాలన్నీ జగన్‌మోహన్‌రెడ్డి తొక్కిపెట్టారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే దొనకొండ విమానాశ్రయం అభివృద్ధిపై కదలికలు రావడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతోపాటు అందుకు సౌకర్యవంతంగా విమానాశ్రయం సైతం అభివృద్ధి చెందుతుందని అందరూ భావిస్తున్నారు. దొనకొండలో విమానాశ్రయం ఏర్పాటైతే పశ్చిమ ప్రకాశంలో నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు చర్చించుకోవడం ప్రారంభించారు.
Jul 20 2024, 12:06