Runa Mafi | మాఫీకి మరో మెలిక.. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట.. నెలరోజుల్లో చెప్తామంటున్న సర్కార్
రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.
రైతు రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది. ఆయా ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులకు జారీ చేసినట్టు పేర్కొన్నది.
ఎవరైనా రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ జరగకపోతే, ఆయా రైతులు ఆందోళన చెందకుండా మీ పరిధిలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు. రైతు రుణమాఫీ-2024కు గాను ప్రతి మండలంలో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని మండల వ్యవసాయ అధికారిని నోడల్ ఆఫీసర్‌గా జూలై 18న ఏర్పాటు చేయడం జరిగింది.
దీనికి సంబంధించిన ఆదేశాలను జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి అదే రోజున జారీ చేయడం జరిగింది. రైతులు ఇచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం నిర్దేశించిన 30 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుంది. పంటరుణం తీసుకున్న, రుణమాఫీకి అర్హులైన (తేదీ 12-12-2018 నుంచి 9-12-2023 మధ్య కాలంలో రైతులు పంట రుణం తీసుకున్న పంట రుణమాఫీ 2024కు అర్హులు) ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణం సమాచారం, స్థితి తెలుసుకోవడానికి జిల్లాలో క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి వ్యవసాయ విస్తర్ణ అధికారికి, మండల పరిధిలో ఉన్న ప్రతి మండల వ్యవసాయ అధికారికి లాగిన్స్ వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చాం. రైతులు ఆధార్ నంబర్‌ను ఏఈవో, లేదా ఎంఈవోకు ఇస్తే పంట రుణమాఫీ 2024 రైతు సమాచారాన్ని తెలుసుకోవచ్చు’ అని జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి ప్రకటనలు వెలువడ్డాయి. దీనిని బట్టి రైతుల్లో కొందరికి రుణమాఫీ జరగలేదని స్పష్టం అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.
రుణమాఫీ జాబితాలో పేర్లు రాని రైతులు శుక్రవారం మండల, జిల్లా వ్యవసాయ కార్యాలయాలకు వెళ్లారు. తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం రాష్ట్రంలో ఏ వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని పరిశీలించినా ఇదే దృశ్యం కనిపించింది. వారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక వ్యవసాయ అధికారులు తలలు పట్టుకున్నారు. రైతుల ఆధార్ వివరాలతో డాటాబేస్‌ను చెక్ చేసి, రుణమాఫీ కానివారి నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ ఫిర్యాదులను ఏం చేస్తారని ప్రశ్నిస్తే.. పై అధికారులకు పంపుతామని, ఎప్పుడు మాఫీ అవుతుందో తెలియదని సమాధానం వచ్చింది. మరికొన్నిచోట్ల రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలోని రుణం మాఫీ అయ్యిందో లేదో మరోసారి చూడాలని అధికారులను విజ్ఞప్తిచేయడం కనిపించింది. కరీంనగర్ జిల్లాలో కొందరు బ్యాంకర్లు ‘ఇప్పుడు వచ్చింది మొదటి జాబితా మాత్రమే. త్వరలో కొత్త జాబితా వస్తుంది. అందులో మీ పేర్లు ఉండే అవకాశం ఉన్నది’ అంటూ సముదాయించి పంపుతున్నారు. ఇది వాస్తవమేనా? అని ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా ‘మా పై అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. మార్పులు, చేర్పులతో త్వరలో కొత్త జాబితా వస్తుందని చెప్తున్నారు’ అని ఒక బ్యాంకు అధికారి పేర్కొన్నారు.
రాష్ట్రంలో పంట రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నది. రైతుల పంట రుణం వివరాలు, వారి బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్, పాస్‌బుక్ నంబర్.. వంటివన్నీ బ్యాంకర్ల దగ్గర ఉన్నాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు, రెవెన్యూ శాఖకు చేరుతున్నాయి. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పక్కాగా ఉంటాయి కాబట్టి.. ఒక్క క్లిక్‌తోనే డాటా మొత్తం వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇంత పక్కాగా వివరాలు ఉన్నా లోపాలు ఎందు కు జరిగాయని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం డిసెంబర్‌లో అధికారంలోకి రాగానే రుణమాఫీ కసరత్తు మొదలుపెట్టింది. అప్పటినుంచే రైతుల వివరాలు సేకరించి, పరిశీలిస్తున్నది. ఏడు నెలల సమయం దొరికినా, ఎందుకు కచ్చితమైన వివరాలు సేకరించలేకపోయారని ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. రుణమాఫీ కానివారు మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయాలనడంపై రైతులు మండిపడుతున్నారు. వివరాలన్నీ బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మళ్లీ దరఖాస్తు చేయాల ని ప్రశ్నిస్తున్నారు. వీటిపై ఎప్పుడు మోక్షం కలుగుతుందో? ఎప్పుడు మాఫీ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
నా పేరుమీద లక్షా అరవై వేల రూపాయలు, భార్యపేరు మీద అరవై వేల రూపాయలు పంట రుణం తీసుకున్నం. ఇప్పటి వరకు పైసలు పడలేదు. రుణమాఫీ సంగతి ఏందో తెలుసుకుందామని హుస్నాబాద్ ఎస్బీఐ బ్యాంకుకు వచ్చిన. రుణమాఫీ జరగలేదని చెప్పిన. మెసేజ్ కూడా రాలేదని ఫోన్ చూపించిన. మాకు రుణమాఫీ రాకుంటే సీఎం రేవంత్‌రెడ్డి దాక పోతం. అస్సలు ఊకోం. మాకెందుకు పైసలు రావద్దు? అర్హతలన్నీ ఉన్నప్పుడు రావాల్సిందే. నలుగురిని కూడగట్టుకొని హైదరాబాద్ దాక పోత. అస్సలు ఇడిసిపెట్టేదేలేదు.
Jul 20 2024, 11:32