దారుణం - పల్నాడు కేరాఫ్ హైదరాబాద్
ఆంధ్రలో అధికారం చేతులు మారింది. అరాచకం జడలు విప్పింది. ఎన్నికలు ముగిసిన తరువాత హత్యా రాజకీయాలు, దాడులు, దహనాలు అన్నది పల్నాడు, రాయలసీమ జనాలకు కొత్త కాదు.
గత అయిదేళ్ల హడావుడి చూసిన తరువాత ఈసారి సీన్ మరింత దారుణంగా వుంటుంది అని అందరూ ముందుగానే అనుకున్నారు. భయపడ్డారు. పైగా లోకేష్ ముందుగానే రెడ్ బుక్ అంటూ హెచ్చరించుకుంటూ వచ్చారు. మొత్తానికి అధికారం చేతులు మారింది. అదే జరిగింది. జరుగుతోంది. ఇంకా జరుగుతుందేమో అన్న భయమో పల్నాడులో ప్రబలింది
పల్నాడులో వైకాపాను తట్టుకోవడానికి చంద్రబాబు చాలా బలమైన నాయకుడిని రంగంలోకి దింపారు. అప్పటి నుంచి గొడవలు రగులుతూనే వున్నాయి. సదరు నాయకుడి దారుణాల గురించి కథనాలు ఎన్నో వున్నాయి. అధికారం చేతిలోకి రాగానే పల్నాడులో ఆ నాయకుడి అనుచరగణం గ్రామాల్లో సాగిస్తున్న అరాచకాలు ఏవీ మీడియాకు ఎక్కడం లేదు.
నిన్నగాక మొన్న జరిగిన మర్డర్ మాత్రమే కాదు, అసలు గ్రామాల్లో వుండకూడదు అని హుకుం జారీ చేసిన సంఘటనలు వున్నాయి. విత్తనాలు జల్లి, పంట సాగుచేయకూడదు అనే ఆదేశాలు. దీంతో భయం భయంగా, బిక్కు బిక్కు మంటూ వేరే చోట్ల కాలం గడుపుతూ వస్తున్నారు నెలరోజులుగా.
ఇప్పుడు ఈ దారుణమైన మర్డర్ చూసిన తరువాత ఇక గ్రామాలు వదిలిన వారు, పొలిమేరలు కూడా వదిలేసారు. హైదరాబాద్ కు చేరిపోయారు. ఇక ఇప్పుడు చాలా మంది రైతు కూలీలు, చిన్న రైతులు హైదరాబాద్ లో పని వాళ్లుగా మారిపోతున్నారు. పరాయి పంచల్లో బతుకుతున్నారు. దాదాపు 1500 మంది ఇలా ఒక్క పల్నాడు నుంచే హైదరాబాద్ కు వలస వచ్చారని ఓ అంచనా.
ఎంతటి దారుణమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ నీతులు చెబుతారు. ఇప్పుడు ఎక్కడ వున్నారు. చంద్రబాబు సుద్దులు చెబుతారు. ఏం జరుగుతోందో చూస్తున్నారా? లోకేష్ ఇది మీ రెడ్ బుక్ పర్యవసానం అంటే సమాధానం ఏమి వస్తుంది.
తెలుగుదేశం అనుకుల మీడియా ఇది వ్యక్తిగత కక్షలు అని చెప్పవచ్చు. మీ హయాంలో వాడు పోయాడు.. వీడు పోయాడు.. అప్పుడు మీకు నొప్పి తెలియలేదు. ఇప్పుడు తెలిసి వస్తోందో అని సోషల్ మీడియా ఎదురుదాడికి దిగవచ్చు. కానీ జగన్ ప్రభుత్వం బాగా లేదని చెప్పి కదా తేదేపాను గెలిపించమని అడిగారు, మరి తామూ అదే చేస్తామని అంటే దానికి ఇక సమాధానం ఏం వుంటుంది. అయిదేళ్ల తరువాత ఓ బాధితులు సమాధానం చెబుతారు.
Jul 19 2024, 17:36