High Court: అర్చకుల బదిలీలపై హైకోర్టు మధ్యంతర స్టే
రాష్ట్రంలోని పూజారులు, అర్చకుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని పూజారులు, అర్చకుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎండోమెంట్ శాఖ పరిధిలోని ఉద్యోగులు ప్రత్యేకంగా పూజారులు, అర్చకుల బదిలీలపై నిషేధాన్ని ఎత్తేస్తూ జారీ చేసిన ఆర్థికశాఖ జీవో 80, రెవెన్యూశాఖ (ఎండోమెంట్) జీవో 64లను సవాల్ చేస్తూ భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఉప ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్న కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ఎండోమెంట్ శాఖ ఉద్యోగుల బదిలీల పేరిట ప్రభుత్వం పూజారులు, అర్చకుల బదిలీలకు ఆప్షన్స్ ఇవ్వాలని కోరుతోందన్నారు.
తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఆధ్యాత్మిక కేంద్రాల్లోని సంప్రదాయాలు, పూజలు, ధర్మాలకు సంబంధించిన వ్యక్తుల విషయంలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా వారి వ్యవహారాలను పర్యవేక్షించే అధికారం ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. అర్చకుల బదిలీలపై మధ్యంతర స్టే విధించింది. రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది.
Jul 16 2024, 09:05