ఆర్టీసీ బస్ ఛార్జీలు భారీగా పెంపు: సీఎం సంతకమే ఆలస్యం
KSRTC: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను భారీగా పెంచడానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. నేడో రేపో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది.
సరిగ్గా నెల రోజుల కిందటే సిద్దరామయ్య ప్రభుత్వం ఇంధన రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తోన్న సేల్స్ ట్యాక్స్‌ను భారీగా వడ్డించింది. లీటర్‌పై 18.44 శాతం అమ్మకం పన్నును 29.84 శాతానికి పెంచింది.
11 శాతం మేర అమ్మకం పన్నును పెంచినట్టయింది. దీనికి కొనసాగింపుగా కేఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలను కూడా పెంచడానికి రంగం సిద్ధం చేసింది.
ఈ విషయాన్ని కేఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఎస్ ఆర్ శ్రీనివాస్ తెలిపారు. బస్ ఛార్జీలను పెంచకపోతే సంస్థను నడిపించడం కష్టమని తేల్చి చెప్పారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టతరమౌతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్- మే- జూన్ నెలల్లో 295 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశామని అన్నారు.
బస్ ఛార్జీలను పెంచాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి డీజిల్ రేటు భారీగా పెరగడమే ప్రధాన కారణం. 2019లో లీటర్ ఒక్కింటికి 60 రూపాయలు ఉన్న డీజిల్ ధర ఇప్పుడు 89 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. బస్సుల కొనుగోలు, ఇతర విడిపరికరాల ధరలు సైతం భారీగా పెరిగాయని, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. 2020 తరువాత ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచలేదని, ఈ ఏడాది వాటిని సవరించాల్సి ఉందని వివరించారు.
వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఇప్పుడున్న ఛార్జీలకు అదనంగా 15 నుంచి 20 శాతం మేరకు ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేశామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు.
ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను యధాతథంగా ఆమోదిస్తుందని చెప్పారు. టికెట్ల పెంపు మహిళలకు కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఛార్జీల భారం శక్తి పథకం కింద కవర్ అవుతుందని, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మహిళలకు ఉద్దేశించిన ఉచిత ప్రయాణంలో ఎలాంటి మార్పూ ఉండబోదని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.
Jul 15 2024, 09:27