Chandrababu : గోతుల రోడ్లకు మోక్షం
వాహనదారులకు ఇదో శుభవార్త. జగన్ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో పడిన ఇబ్బందులకు కూటమి సర్కారు చెక్ పెట్టే కార్యక్రమానికి తెరదీసింది.
రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేసి చక్కటి ప్రయాణానికి వీలుగా వాటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ను ఆదేశించింది. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతుల్లో థర్మ్‌ల్ విద్యుత్ ప్లాంట్ల నుంచివచ్చే బూడిద(ప్లైయాష్) వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు.
శాస్త్ర, ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రహదారులపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీరింగ్ చీఫ్‌లు వేణుగోపాల్‌రెడ్డి, నయీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,087 కిమీ పరిధిలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు.
ఈ గణాంకాలపై సీఎం విస్తుపోయినట్లు తెలిసింది. ఇన్ని వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయకుండా ఎలా ఉన్నారు? గతంలో అసలు ఏ పనీచేయలేదా? అని ఆరాతీశారు. జగన్ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 4,151 కిలోమీటర్ల రోడ్లపై తక్షణమే మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చాలని, మరో 2 వేల కిలో మీటర్ల మేరకు రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు నివేదించారు. దీనికిగాను కనీసం రూ.350 కోట్లపైనే నిధులు అవసరం ఉంటుందని సీఎంకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
4,151 కి.మీ. మేరకు రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇస్తామని ఆర్‌అండ్‌బీకి హామీ ఇచ్చారు. ఓటాన్ అకౌంట్‌లో ఈ నిధులు కేటాయిస్తామని, రహదారుల రిపేర్లకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇకపై ఏ సమస్య ఉన్నా తనదృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు
థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద(ప్లైయా్‌ష)ను రహదారి మరమ్మతులకు ఉపయోగించే అంశంపై పైలెట్ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీకి సూచించారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు బూడిదను ఉపయోగించాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 రహదారులపై ఈ ప్రయోగం చేశారు. విజయవాడలోని నున్న బైపాస్, నెల్లూరు ఎన్‌పీఎస్ రోడ్డు, ప్రొద్దుటూరు రహదారులపై ప్రయోగాత్మకంగా బూడిద వినియోగంతో గుంతలు పూడ్చారు.
అయితే, ఆ ప్రయోగం పూర్తిగా విజయవంతం కాలేదు. గుంతలను పూడ్చేందుకు ఉపయోగించిన బూడిద బిట్‌మెన్, ఇతర మెటల్‌తో మిక్సింగ్ కావడం లేదు. దీంతో పొడివాతావరణంలో ఆ బూడిద వాహనాల రాకపోకలతో గాల్లోకి లేస్తోంది. ఈ ప్రయోగంపై ఆర్‌అండ్‌బీ ప్రజల నుంచి స్పందన కోరగా ప్రతికూలంగా వచ్చింది. ఇదే విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇద్దరు సీఆర్‌ఐఐకి చెందిన ఐఐటీ నిపుణులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైన్లోకి తీసుకొని మాట్లాడారు. వారు ఇచ్చిన సూచనలతో బూడిద వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, సీఆర్‌ఆర్‌ఐ, ఢిల్లీ, ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ అమరావతి నిపుణుల సహకారంతో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శుక్రవారం విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న చీఫ్ జస్టిస్ అధికారిక నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిని ఆయన కలవడం ఇదే ప్రఽథమం.
ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యలో ఆగిపోయిన హైకోర్టు నూతన భవన నిర్మాణం, హైకోర్టు న్యాయమూర్తుల నివాస భవనాల పూర్తికి ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత హైకోర్టు భవనంలో ఇంకా అదనంగా కల్పించాల్సిన వసతులు తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Jul 13 2024, 19:26