మంత్రి వర్గంలో చోటు ఎవరికి ?
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సమాయత్తం అవుతుండటంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్‌లతోపాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రస్తుతం మంత్రి పదవి రేసులో ఉన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో మంత్రి పదవి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్‌కు ఊపు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. మంచిర్యాల నుంచి గెలుపొందిన ప్రేంసాగర్‌రావు 2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పదవిని అలంకరించారు. 2018లో మంచిర్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పీఎస్సార్‌కే మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి తనయులైన బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్‌లు సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారు. గడ్డం వినోద్ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 2009 వరకు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. గడ్డం వివేక్ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.
వీరు సైతం కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి మంత్రి పదవి దక్కించుకునేందుకు మంతనాలు సాగించారు. మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ప్రచారం జిల్లాలో ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
Jul 05 2024, 11:48