Bhole Baba: ఎవరీ భోలే బాబా.. అతని చరిత్ర ఏంటి.. అసలు పాదధూళీ కథేంటి?
భోలే బాబా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. హత్రాస్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనతో ఆ బాబా హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన పాదధూళీ కోసం భక్తులు..
ఆయన అసలు పేరు సూరజ్ పాల్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటా జిల్లా, పటియాలి తహసీన్‌లోని బహదూర్ గ్రామంలో పుట్టాడు. తన చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేశాడు. ఓవైపు పొలం పనులు చేస్తూనే.. మరోవైపు విద్యాభ్యాసం కొనసాగించాడు. తన చదువు పూర్తి చేసుకున్నాక.. రాష్ట్ర పోలీసు శాఖలో చేరాడు. 18 సంవత్సరాల పాటు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్) తీసుకుని, ఆధ్యాత్మిక బాట పట్టాడు. పోలీసు శాఖలో పని చేసే సమయంలోనే ఆయనపై లైంగిక వేధింపుల కేసులో నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఆ కేసుల్లో 1997లో అరెస్టై.. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాడు.
జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన పేరుని నారాయణ్ సాకార్ విశ్వహరి బాబాగా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఓ ఆశ్రమాన్ని తెరించి..
క్రమంగా జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే బాబాగా పాపులారిటీ వచ్చేయడంతో.. సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అలీగఢ్‌తో పాటు హత్రాస్‌లోనూ.. ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహించేవాడు. ఇందుకు వేల సంఖ్యలో, కొన్ని లక్షల్లోనూ భక్తులు హాజరవుతుంటారు. కొవిడ్ సమయంలో ఆయన పేరు దేశమంతా వినిపించింది. ఆ సమయంలో ఓ సత్సంగ్ కార్యక్రమంగా నిర్వహించగా.. ఏకంగా 50 వేల మంది వచ్చారు. దీంతో అది వివాదాస్పదమైంది.
మంగళవారం భోలే బాబా హత్రాస్ జిల్లాలోని పుల్‌రయీ గ్రామంలో ఓ సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు 80వేల మందికే అనుమతి ఇచ్చారు కానీ.. 2.5 లక్షల మంది వరకు తరలివచ్చారు. తన ప్రవచనాలు ముగించుకొని భోలే బాబా కారులో వెళ్లిపోయాడు. అయితే.. ఆయన వాహనం ఏ మార్గంలో వెళ్లిందో, ఆ మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్దవం లభిస్తుందని భక్తులు నమ్మారు. ఆ నమ్మకంతో అందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి.. పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Jul 03 2024, 20:13