రైతుభరోసా సీలింగ్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనే అంకిత భావంతో తమ ప్రభుత్వం పని చేస్తున్నదని, త్వరలోనే రైతులు శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం, రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో భట్టి మాట్లాడుతూ.. రైతు భరోసా మొత్తం నిజమైన రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రైతు భరోసాపై విధివిధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని నాలుగు గోడల మధ్య కూర్చుని విధివిధానాలు తాము రూపొందించబోమన్నారు.
రైతు భరోసా విధివిధానాలపై పాత ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. రైతులు, ట్యాక్స్ పేయర్స్, మీడియా, మేధావులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. బడ్జెట్ సమావేశాల్లోపే రిపోర్టును సిద్ధం చేసి ఆ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడుతామన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేసి తీరుతామని పేర్కొన్నారు.
ఐదు ఎకరాలలోపు వారికే రైతు భరోసా ఇస్తారనే ప్రచారం జరుగుతోందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని జూలై 15 నాటికి నివేదిక సమర్పిస్తామని విధివిధానాల రూపకల్పన ప్రక్రియ అంతా బడ్జెట్ సమావేశాలలోపే పూర్తవుతుందని చెప్పారు. తన నియోజకవర్గంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ ఇది దురదృష్టకరమని ఈ విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేయించాలని తాను అధికారులను ఆదేశించానని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈనెల 6వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో గత పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని విభజన చట్టంలోని అంశాలు ఎజెండాగా ఉండబోతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు. ఏపీలో విలీనం అయిన ఏడు మండలాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్న హరీశ్‌రావు చరిత్ర మరిచిపోతే ఎలా అని సెటైర్ వేశారు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం లేదని రాష్ట్ర విభజన జరిగాక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు మండలాలను ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఏపీకి అప్పగించిందన్నారు.
ఈ విషయంలో ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత గాలికి వదిలేశారన్నారు. తీరా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఈ విషయంలో దీక్ష చేయాలని సూచించారు. బీఆర్ఎస్,బీజేపీ కలిసి చేసిన పాపంతోనే ఈ ఏడు మండలాలు ఏపీకి పోయాయని విమర్శించారు. చంద్రబాబుకు తాను శిష్యుడిని కాదని సహచరుడినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టంగా చెప్పారని అయినా బురదజల్లేందుకే గురుశిష్యులు అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Jul 03 2024, 20:06