డయాఫ్రం వాల్‌పై ఆందోళన వద్దు
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు భరోసా ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు భరోసా ఇచ్చారు. ఇలా దెబ్బతిన్న డయాఫ్రం వాల్స్‌కు తాము గతంలో మరమ్మతులు, ప్రత్యామ్నాయాలు సూచించామన్నారు. వాటికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలు భద్రతాపరంగా బలీయంగానే ఉన్నాయని స్పష్టం చేశారు. దీనికీ ప్రత్యామ్నాయాలు సూచిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు జియాన్ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్ బి పాల్.. కెనడా నిపుణులు సీన్ హించ్‌బెర్గర్, రిచర్డ్ డొనెల్లీ సోమవారం వరుసగా రెండో రోజు కూడా ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు అతిథి గృహానికి చేరుకుని.. ప్రాజెక్టు కార్యాలయంలో గంటన్నర సేపు ఫిజియో మీటర్ల ద్వారా సీపేజీ తీవ్రత తెలుసుకున్నారు. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. కేసింగ్ పైపులను ఎగువ కాఫర్ డ్యాం నడుమ పలు ప్రాంతాల్లో భూమిలో దింపి నీటిని పంపి పరీక్షలు నిర్వహించడం ద్వారా కాఫర్ డ్యాం లోపల భూగర్భంలో ఎన్ని మీటర్ల లోతు నుంచి ఎత్తు వరకూ సీపేజీ వస్తోందో చర్చించారు. ఇతర పద్ధతుల ద్వారా సీపేజీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉందో లేదో పరిశీలించారు.
కేంద్ర జలసంఘం డిప్యూటీ డైరెక్టర్ అశ్విన్‌కుమార్, ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి, జలసంఘం శాస్త్రవేత్త మనీశ్ గుప్తా, జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఆఫ్‌స్ర్టీమ్ కాఫర్ డ్యాం నిపుణుడు, ఆఫ్రి కన్సల్టెన్సీ సభ్యుడు సంపత్ పూర్తి వివరాలను తెలియజేశారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన చర్చల్లో కాఫర్ డ్యాం గ్యాప్‌ల పూడ్చివేత, సీపేజీ నివారణ అంశాలపై నిపుణులు మాట్లాడారు. అనంతరం కాఫర్ డ్యాంల మధ్య జరుగుతున్న వైబ్రో కాంపాక్షన్ పనులను స్వయంగా పరిశీలించి సంబంధిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత భోజన విరామానంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటిదాకా నిర్మాణ సంస్థలు చేపట్టిన కట్టడాలకు సంబంధించి డిజైన్లు, వాటికి కేంద్ర జలసంఘం ఇచ్చిన అనుమతులు వంటివాటిపై సమీక్ష జరిపారు.
డయాఫ్రం వాల్ దెబ్బతిన్న తర్వాత.. పోలవరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపేందుకు జల సంఘం జంకుతోంది. అయితే.. అలాంటి భయాలేమీ అక్కర్లేదని నిపుణులు సూచించారు. డయాఫ్రం వాల్ పునరుద్ధరణ సాధ్యమేనని.. అది కట్టాక దానిపై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం వేసేయవచ్చని తెలిపారు. మంగళవారం నిర్మాణ సంస్థలతో సమావేశమయ్యాక.. డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంల్లో సీపేజీపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టులో ఇప్పటిదాకా నిర్మించిన కట్టడాల డిజైన్లు, వాటి సామర్థ్యాలను కూలంకషంగా వివరించాలని నిపుణులు వాటికి సూచించారు. తర్వాత రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు.
ఇటీవల కుంగిన స్పిల్‌వే గైడ్ బండ్‌ను మంగళవారం వారు పరిశీలిస్తారని సీఈ నరసింహమూర్తి తెలిపారు. కాగా.. ప్రాజెక్టుల కీలక నిర్మాణాలపై అనుభవం కలిగిన అంతర్జాతీయ నిపుణులు.. దెబ్బతిన్న పోలవరం నిర్మాణాలపై భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇవ్వడం జల వనరుల శాఖ అధికారులకు ఊరటనిచ్చింది. ఇక నిర్మాణాలపై ముందడుగు వేయడంపై దృష్టిసారించాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) చీఫ్ ఇంజనీర్ రాజేశ్‌కుమార్, వ్యాప్కోస్ మేనేజర్ ఎస్‌కే పట్నాయక్, ఈఈలు మల్లికార్జునరావు, బాలకృష్ణ, పాండురంగయ్య, ప్రేమ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు
Jul 03 2024, 15:07