బిహార్‌కు ప్రత్యేక హోదా
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తన డిమాండ్లను సాధించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ తన డిమాండ్లను సాధించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తమ రాష్ట్రం బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పునరుద్ఘాటిస్తూ కేంద్రాన్ని తాజాగా డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది.
పేపర్ లీక్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే పరీక్షా పేపర్ల లీకేజీలకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పటిష్ఠ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామిగా మారిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఈ పార్టీ 12 సీట్లను గెలుచుకుంది. దీంతో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ కీలకమైంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఈ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం నేపథ్యంలో తమ పార్టీ బాధ్యతతోపాటు ప్రజల అంచనాలు కూడా పెరిగిపోయాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గత ఏడాది బిహార్ కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది.
అయితే ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి జేడీయూ కీలకంగా మారిన నేపథ్యంలో ఈ డిమాండ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా.. జేడీయూ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ కుమార్ ఝాను శనివారం నియమించారు. బీజేపీతో ఈయనకు మంచి సంబంధాలున్న నేపథ్యంలో ఆయనకు ఈ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. పార్టీ డిమాండ్లను నెరవేర్చుకోవడంలో ఈయన సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ.. బిహార్‌పై ఎల్లప్పుడూ దృష్టిసారిస్తారని, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కోసం పార్టీ చేస్తున్న డిమాండ్ నెరవేరుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ను 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల పట్నా హైకోర్టు కొట్టివేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జేడీయూ.. రాష్ట్ర చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. దీని వల్ల న్యాయ సమీక్షకు అవకాశం ఉండదని భావిస్తోంది.
బిహార్‌లో మరో బ్రిడ్జి కూలిపోయింది. కేవలం తొమ్మిది రోజుల్లో ఈ రాష్ట్రంలో ఐదు బ్రిడ్జిలు కూలిపోయి రాష్ట్రంలో పనుల నాణ్యతను ప్రశ్నిస్తున్నాయి. బిహార్‌లోని మధువని జిల్లాలో నాలుగు పిల్లర్ల ఓ బ్రిడ్జి భారీ వర్షాలకు శుక్రవారం కూలిపోయింది. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న మాదేపూర్ బ్లాక్‌లో భుతహి నదిపై 75 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని రూ.3 కోట్ల ఖర్చుతో 2021 నుంచి నిర్మిస్తున్నారు. భారీ వర్షాలకు నదిలో ప్రవాహం పెరిగి ఓ వైపు పిల్లర్ కొట్టుకుపోవడంతో బ్రిడ్జి కూలిపోయినట్లు బిహార్ ప్రజా పనుల శాఖ అధికారులు చెబుతున్నారు. కూలిన బ్రిడ్జి కనిపించకుండా కాంట్రాక్టర్ టార్పాలిన్ కప్పారు.
Jun 30 2024, 19:21