Telangana: కాంగ్రెస్‌లోకి మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ‘కారు’ (BRS) పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.! అసెంబ్లీలో అట్టర్ ప్లాప్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకుందామని భగీరథ ప్రయత్నాలు చేసి అడ్రస్ లేకుండా పోయింది.!..
ఇప్పటికే.. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒకరు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాగా.. మరో ఇద్దరు హైదరాబాద్ సిటీకి చెందిన వారేనని.. ఇంకో ఇద్దరు హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల ఎమ్మెల్యేలు అని లీకులు వస్తున్నాయి.
దీంతో ఆ ఐదుగురు ఎవరబ్బా..? అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులై మొదటి వారం లేదా.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక తర్వాత ఈ చేరికలు ఉంటాయని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే సంఖ్య పెరగొచ్చే కానీ.. తగ్గే అవకాశం అస్సలు లేదని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్న పరిస్థితి.
గులాబీ దళం ఖాళీ అయ్యి, కాంగ్రెస్ హౌస్‌ఫుల్ అవుతుండటంతో ఈ మధ్యనే ఎమ్మెల్యేలతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక సమావేశం నిర్వహించారు. పార్టీని వీడొద్దని ఒకటికి పది సార్లు ఎమ్మెల్యేలకు చెప్పారు గులాబీ బాస్. ‘అబ్బే.. అస్సలు మారే ప్రసక్తే లేదు సార్.. మీ వెంటే ఉంటాం’ అని చెప్పిన రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేలు జంప్ అయిపోతుండటం గమనార్హం. ఎప్పుడు ఎవరు పార్టీ వీడుతారో..? పార్టీలో ఉండేదెవరో..? పోయేదెవరో..? అని పెద్ద చర్చే జరుగుతోంది. దీంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. బీఆర్ఎస్‌లో ఆఖరికి ఆ నలుగురు మాత్రమే మిగులుతారని కాంగ్రెస్ నుంచి విమర్శలు, అంతకుమించి ఆరోపణలు పెద్ద ఎత్తునే వస్తున్నాయ్. ఆ నలుగురు మరెవరో కాదని.. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు అని కాంగ్రెస్ మంత్రులే కామెంట్స్ చేస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మరకు ఫామ్ హౌస్‌లో కేసీఆర్ మాట్లాడిన మాటలు కొన్ని లీకయ్యాయి. ‘ఒకటి రెండు నెలలు ఓపిక పట్టండి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్‌లో ఉన్నాం. రెండు నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. నేను మీకు మార్గదర్శిగా ఉంటాను. కాంగ్రెస్‌లో చేరుతున్న మన ఎమ్మెల్యేలను న్యాయస్థానం ద్వారా అనర్హులుగా ప్రకటింపజేస్తాం. ఢిల్లీకి చెందిన పెద్ద లాయర్‌తో మాట్లాడాం. ఇంతకంటే ఎక్కువ చెప్పను. చెబితే రహస్యాలు లీక్ అవుతాయి’ అని కేసీఆర్ ఫాంహౌస్‌కు పిలిపించుకున్న తన పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకూ నిజమో కానీ.. జంపింగ్‌లు మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వీడుతున్నారే తప్ప.. పార్టీలో ఉండటానికి ప్రయత్నాలు చేయట్లేదు. తెలంగాణ రాజకీయాల్లో మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.
Jun 30 2024, 18:52