పది’ పాట్లు..!
మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..
మార్కెట్‌లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ.. వాటిని ఎవరూ స్వీకరించడం లేదు. మరోవైపు పది నోట్లను సరఫరా చేయలేక బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. ఆర్బీఐ నుంచి సరఫరా లేనప్పుడు తామేం చేస్తామని చెబుతున్నారు.
మార్కెట్‌లో పదుల కొరత ఏడాదిగా కొనసాగుతోంది. నోట్ల రద్దు తర్వాత పరిస్థితి గాడిన పడుతుందనుకున్న సమయంలో చిన్న నోట్ల కొరత పెరుగుతుండడం తో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. టీ స్టాల్స్, కిరణా షాపుల్లో వ్యాపారమంతా రూ.10తోనే మొదలవుతుంది. పెద్దమొత్తం బిల్లులకు పెద్దనోట్లు ఇచ్చినప్పుడు ఎలాంటి సమస్య ఉత్పన్నం కావడం లేదు. చిన్న చిన్న బేరాల విషయంలో మాత్రం వివాదాలు జరుగుతున్నాయి.
సాధారణంగా కొత్త కరెన్సీని ఆర్‌బీఐ విడుదల చేసినప్పుడు బ్యాంకుల వద్ద నుంచి.. రూ.5, రూ.10, రూ.20, రూ.50నోట్లను తీసుకుని భద్రపరుచుకుంటారు. ఐదు రూపాయల నోట్ల ముద్రణ ఆగిపోయిన తర్వాత నాణేలు మనుగడలోకి వచ్చాయి. వాటి లభ్యత కూడా క్రమంగా తగ్గుతోంది. ఆర్‌బీఐ పది రూపాయల నోట్లతోపాటు నాణేలు కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. కానీ, నోట్లలో జరిగినన్ని లావాదేవీలు నాణేలతో జరగడం లేదు. పది రూపాయలు చిల్లర ఇవ్వాల్సిన స్థానంలో నాణేలు ఇస్తుంటే వినియోగదారులు గానీ, వ్యాపారస్తులుగానీ తీసుకోవడం లేదు. దీంతో సమస్య తీవ్రమవుతోంది.
ఆర్‌బీఐ ముద్రించిన కరెన్సీని వ్యతిరేకించడం నేరమని న్యూమి్‌సమ్యాటిక్ నిపుణుడు ప్రసాద్ అన్నారు. వ్యతిరేకించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం ఆర్‌బీఐకి ఉందన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లోను పది రూపాయల నాణేల చలామణి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు దీనిపై అపోహలున్నాయి. ఐదు రూపాయల నాణేలు విడుదలైన కొత్తలో నకిలీ నాణేలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పది రూపాయల నాణెం విషయంలోనూ అదే అనుమానాలున్నాయి. ప్రజల్లో ఈ నాణెం మనదేశానిది కాదన్న భావన ఉంది’ అని ప్రసాద్ చెప్పారు. మార్కెట్లో పది రూపాయల నోట్ల కొరత ఉన్నమాట వాస్తవమేనని, దీనికి ఆర్‌బీఐ కారణమని మరో న్యూమి్‌సమ్యాటిక్ నిపుణుడు రామకృష్ణ అన్నారు. పది రూపాయల నాణేలను చలామణిలోకి తీసుకురావడం కోసం హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 నోట్ల సరఫరాను బాగా తగ్గించిందని వెల్లడించారు.
Jun 30 2024, 12:30