Telangana Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
శని ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయికల్ మండలం అల్లీపూర్‌లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడిలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ చిరు జల్లులు పడ్డాయి
Jun 29 2024, 12:50