త్వరలో రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ!
- జూలై మొదటివారంలోనే ముహూర్తం..
- పీసీసీ చీఫ్ ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
- 4 రోజులుగా ఢిల్లీలోనే రేవంత్..
- అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి భట్టి..
- సోనియాతో మహేశ్‌కుమార్, యాష్కీ భేటీ
రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది. క్యాబినెట్‌ను జూలై మొదటివారం లో విస్తరించే అవకాశం ఉన్నట్టు సమాచా రం. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపైనా కాంగ్రెస్ అధిష్ఠా నం దృష్టి సారించింది.
క్యాబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు జోరుగా చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అధిష్ఠానం మళ్లీ ఢిల్లీకి పిలిపించుకున్నది. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు భేటీ అయ్యారు.
ఆ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరికపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. జూలై మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
పార్టీలో కొత్తగా చేరినవారిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి? పాతవారిలో ఎవరికి ఇవ్వాలనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల అభిప్రాయాలను దీపాదాస్ మున్షీ తీసుకున్నట్టు సమాచారం. స్థానికత, సామాజికవర్గాల కోణం లో లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీకాలం జూలై 7తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానం దృష్టి సారించడంతో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్ గురువారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు తమవారికి మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు పలువురు మంత్రులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
Jun 28 2024, 07:36